Raghurama : అరరె, రఘురామ ఇలా తప్పించుకోజూస్తున్నారే.!

Raghurama : ఏపీ సీఐడీ నుంచి రఘురామకి నోటీసులు వెళ్ళాయి.. విచారణకు హాజరు కావాల్సిందిగా. పిలిచింది విచారణకే గనుక, రఘురామ ఆ విచారణకు హాజరయి వుండాల్సింది. కానీ, తనకు ఏపీ సీఐడీ నుంచి ప్రాణ హాని వుందంటూ రఘురామ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

గతంలో తనను అరెస్టు చేసినప్పుడు చావబాదారన్నది రఘురామ ఆరోపణ. పాపం ఆయన ఎంత గొంతు చించుకున్నా, ఈ విషయమై ఎవరూ ఇప్పటిదాకా పట్టించుకున్నది లేదు. అదంతా ఓ పెద్ద డ్రామా.. అన్న అభిప్రాయమే చాలామందిలో వుంది.

ఎంపీని కొట్టేంత సాహసం ఏపీ సీఐడీ చేస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. సరే, ఆ సాకు చూపి ఇప్పుడు విచారణకు డుమ్మా కొట్టడం ఎంతవరకు సబబు.. అన్నది రఘురామ ఆలోచించుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణను తప్పించుకుంటున్నారని పదే పదే రఘురామ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. మరిప్పుడు రఘురామ చేస్తున్నదేంటి.?

అనారోగ్యంతో బాధపడుతున్న తాను వైద్య చికిత్స నిమిత్తం ఢిల్లీలో వున్నాననీ, కరోనా నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాలి గనుక, తాను విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాలేననీ రఘురామ చెబుతున్నారు.

మరి, రఘురామ చెబుతున్న మాటల్ని ఏపీ సీఐడీ ఎలా పరిగణిస్తుంది.? విచారణకు హాజరు కాకపోతే ఏపీ సీఐడీ తదుపరి చర్యలు ఎలా వుంటాయి.? ఏమోగానీ, ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మీద రఘురామ ఆరోపణల పర్వం కొనసాగుతోంది.