వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సూపర్ షాక్ తగిలింది. వైఎస్ జగన్ అలాగే విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును ఆశ్రయించిన రఘురామ, ఆ కోర్టు నుంచి తీర్పు వచ్చేలోపు.. ఆ తీర్పు వెలువడకుండా నిలువరించాలంటూ హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డారు. సీబీఐ కోర్టులో వచ్చే తీర్పు విషయమై ముందే గందరగోళానికి గురైన రఘురామ, ‘జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తిరస్కరణ’ అంటూ మీడియాలో వచ్చిన ఓ వార్త ఆధారంగా, హైకోర్టును ఆశ్రయించి.. ఏకంగా సీబీఐ కోర్టు ఇవ్వబోయే తీర్పుని నిలుపుదల చేయాలని కోరడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, విజయసాయిరెడ్డికీ.. అక్రమాస్తుల కేసులో న్యాయస్థానాలే బెయిల్ మంజూరు చేశాయి. ఆ బెయిల్ రద్దు చేయాలని రఘురామ సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
ఇప్పుడు అదే సీబీఐ కోర్టు తీర్పు విషయంలో రఘురామ అనుమానాలు వ్యక్తం చేయడం సహజంగానే అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన రఘురామ, కొద్ది రోజులు వైసీపీలో బాగానే వున్నారు. ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, వైసీపీకి రెబల్‌లా తయరయ్యారు. వైసీపీ మీదా, వైఎస్ జగన్ మీదా, వైఎస్ జగన్ ప్రభుత్వం మీదా.. దూషణలకు దిగుతూ వచ్చారు రఘురామ రచ్చ బండ పేరుతో. ఈ క్రమంలో రఘురామ అత్యుత్సాహం హద్దులు దాటేసింది.. ఆయన మీద రాజద్రోహం కేసులు కూడా నమోదయ్యాయి.. ఆయన్ని ఏపీ సీఐడీ గతంలో అరెస్ట్ చేసింది కూడా. ఆయనా ఇప్పుడు బెయిల్ మీదనే వున్నారు. ఇక, సీబీఐ కోర్టు తీర్పు కాస్సేపట్లో వెల్లడయ్యే అవకాశం వుంది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా నిలువరించాలని హైకోర్టు మెట్లెక్కిన రఘురామ, అక్కడ షాక్ తగిలేసరికి డీలాపడిపోయే వుండాలి. సీబీఐ కోర్టు తీర్పు ఎలా వుంటుందో.. ఇక్కడ రఘురామ పరిస్థితి ఏమవుతుందో.