బీజేపీలో చేరనున్న కేశినేని నాని.?

విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నానికి గత కొంతకాలంగా సొంత పార్టీ నుంచే సెగ ఎదురవుతోంది. నిజానికి, ఆయనే సొంతంగా ‘పొగ’ పెట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో. ఇది కాస్త విచిత్రమైన విషయం.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని నాని, అప్పటినుంచీ టీడీపీతో వున్నా… లేనట్టే వ్యవహరిస్తున్నారు. లేకపోయినా, వున్నట్లే వ్యవహరిస్తున్నారు. టీడీపీలోనే వున్నానంటారు.. టీడీపీ మీదనే విమర్శలు చేస్తుంటారు.

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని కుమార్తె, శ్వేత టీడీపీ నుంచి బరిలోకి దిగారు. కానీ, సొంత పార్టీలో కుమ్ములాటలు, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. ఆ ప్రకంపనలు టీడీపీలో ఇంకా కొనసాగుతూనే వున్నాయి.

‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేను. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తాను. ఇండిపెండెంట్‌గా అయినా గెలుస్తాను..’ అంటూ ఈ మధ్యనే కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా, కేశినేని నాని.. బీజేపీ అధినాయకత్వంతో టచ్‌లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకో వైపు వైసీపీతో కూడా కేశినేని నాని మంతనాలు జరుపుతున్నారట. పనిలో పనిగా జనసేన పార్టీలోనూ కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ప్రత్యేక హోదా విషయంలో గతంలో పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శించారు కేశినేని నాని. అయితే, అది గతం.

ఇప్పుడాయన ఆలోచనలు మారాయి. ఇంకోసారి కేశినేని నానికి టిక్కెట్ ఇస్తే, పార్టీ నాశనమైపోతుందన్న భావన టీడీపీలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే, కేశినేని నాని తన దారి తాను చూసుకోక తప్పేలా లేదు. బీజేపీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నారన్నది తాజా ఖబర్.