రాబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం ఖాయమంటూ చాలా సర్వేలు జోస్యం చెప్పాయి. లోక్ సభ ఎన్నికల్లో వైసిపికి 23 సీట్లు వస్తాయంటూ ఓ జాతీయ మీడియా సర్వేలో చెప్పింది. అప్పట్లో సర్వే వివరాలు చూసినపుడు నిజంగానే వైసిపికి అన్ని వస్తాయా అనే అనుమానం వ్యక్తం చేసినవారున్నారు. కానీ టికెట్ల విషయంలో చంద్రబాబు పరిస్ధితి చూసిన తర్వాత సర్వే ఫలితాలు నిజమవుతాయేమో అనే అనిపిస్తోంది.
అభ్యర్ధులను ఫైనల్ చేయటంలో చంద్రబాబులోని డొల్లతనం స్పష్టంగా బయటపడుతోంది. టికెట్ కోసం ప్రతీ ఒక్కరూ చంద్రబాబును భయపెడుతున్న వారే. ఒకపుడు చంద్రబాబు తమకు టికెట్ ఇస్తే చాలని అనుకున్న వారే ఇపుడు కావాల్సిన టికెట్ కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఎంపిలుగా పోటీ చేయమంటే చివరకు సిట్టింగులు కూడా వద్దనేస్తున్నారు. అదే సమయంలో ఎంఎల్ఏగా ఫలానా నియోజకవర్గంలో టికెట్ ఇస్తేనే పోటీ చేస్తా అంటూ బెదిరిస్తుండటమే విచిత్రంగా ఉంది.
రాష్ట్రం మొత్తం మీద 25 లోక్ సభ స్ధానాల్లో కనీసం 15 నియోజకవర్గాల్లో టిడిపికి అభ్యర్ధులే లేరు. పోటీ చేయమని చంద్రబాబు నేతలను బ్రతిమలాడుతు, ఒత్తిడి పెడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అటు ఎంపి అభ్యర్ధులు లేక ఇటు అసెంబ్లీల్లోను అభ్యర్ధులను ఖరారు చేయలేక చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. టిడిపిలో జరుగుతున్నది చూస్తుంటే చివరకు సర్వేలే నిజమయ్యేట్లున్నాయ్.