అత్తింటి వేధింపులతో ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి

ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో… తనతో పాటే తన ఇద్దరు పిల్లలను కూడా ఈ లోకం నుంచి తీసుకెళ్లింది. తాను పోయాక తన పిల్లల బతుకెట్లా అని అనుకుందో ఏమో ఆ తల్లి తన పిల్లలను గొంతు పిసికి చంపి ఆ తర్వాత తాను ఉరేసుకొని చనిపోయింది. ఈ హృదయ విదారకమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొగల్తూరుకు చెందిన వెంకట రామాంజనేయరెడ్డికి ఆలమూరుకు చెందిన లక్ష్మీ ప్రసన్నతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. రోజా శ్రీలక్ష్మీ, జాహ్నవి. వీరు స్కూలుకు వెళుతున్నారు. రామాంజనేయరెడ్డి తన తండ్రి సత్యనారాయణ రెడ్డితో కలిసి మొగల్తూరులో  మిల్లు నడిపించేవాడు. మూడు నెలల క్రితం సత్యానారాయణ రెడ్డి 3 నెలల క్రితం చనిపోగా, ఆయన భార్య రామలక్ష్మీ 12 రోజుల క్రితం చనిపోయింది. వీరు చనిపోయే నాటికే మిల్లు పేరు మీద 7 కోట్ల రూపాయల అప్పు ఉంది.  

గత కొద్ది రోజులుగా భర్త లక్ష్మీ ప్రసన్నను అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో తన తల్లిదండ్రులకు చెప్పగా వారు రూ.70 లక్షలు రామాంజనేయరెడ్డికి ఇచ్చారని తెలుస్తోంది. అయినా కూడా లక్ష్మీకి వేధింపులు ఆగలేదు. రామలక్ష్మీ దినాల నాడు లక్ష్మీ ప్రసన్న ఆడపడుచులు మరియు భర్త ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మీ ప్రసన్న సోమవారం రాత్రి ముందుగా తన ఇద్దరు బిడ్డలను తువాళతో ఉరేసి చంపింది. ఆ తర్వాత తాను ఉరేసుకొని చనిపోయింది. 

విగత జీవులుగా పడి ఉన్న చిన్నారులు

భర్త మిల్లు నుంచి వచ్చి చూసేలోగా ఈ దారుణం జరగడంతో  ఆయనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా రామాంజనేయ రెడ్డిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపు లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు అతని పై ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వారు కిరాయి ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది.

అందరితో మంచిగా ఉండే లక్ష్మీ ప్రసన్న ఇంతటి దారుణానికి ఒడిగడుతుందని తాము అనుకోలేదని చుట్టుపక్కల వారు అంటున్నారు. తల్లి, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. ఈ కేసు పై పలు అనుమానాలు ఉండడంతో హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.