ఏ పార్టీలో అయినా సరే అధినాయకత్వానికి అనుకూలంగా, అణకువగా ఉంటేనే నాయకులకు భవిష్యత్తు అనేది ఉంటుంది. కాదని ఎదురుతిరిగితే సోదిలో కూడ వినబడకుండా పోతారు. అంతకుమునుపు ఎమ్మెల్యేగా గెలిచినా ఎంపీగా నెగ్గినా ఒకసారి హైకమాండ్ ఆగ్రహానికి గురైతే గల్లంతే. అలా తెలుగుదేశంలో గల్లంతైన నేతలు చాలామందే ఉన్నారు. వారిలో పోలవరం మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస రావు ఒకరు. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మొడియం శ్రీనివాస రావు మొదట్లో అధిష్టానంతో చాలా సంఖ్యాతగా ఉండేవారు. జిల్లా స్థాయి నేత, పశ్చిమ గోదావరి జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు మాగంటి బాబుకు ప్రియమైన అనుచరుడిగా ఉండేవారు. అందుకే 2012 ఉపఎన్నికల్లో టికెట్ సొంతం చేసుకున్నారు.
ఆ ఎన్నికల్లో మాగంటి బాబు పట్టుబట్టి మరీ మొడియంకు టికెట్ ఇప్పించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడినా కూడ నియోజకవర్గంలో యాక్టివ్ గానే ఉండేవారు. అతనిలోని ఉత్సాహాన్ని చూసే మాగంటి బాబు 2014 ఎన్నికల్లో కూడ పోలవరం టికెట్ ఇప్పించారు. చంద్రబాబు సైతం మొడియం ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండవసారి అనుగ్రహించారు. ఆ ఎన్నికలో రాష్ట్రం మొత్తంలో టీడీపీ తరపున పోటీచేసిన ఎస్టీ అభ్యర్థులంతా ఓడిపోగా మొడియం శ్రీనివాస రావు మాత్రమే గెలిచి పార్టీలో ప్రత్యేకంగా నిలిచారు. గెలిచింది తడవు ఆయన మంత్రి పదవి మీద ఆశపెట్టుకున్నారు. గట్టిగానే లాబీయింగ్ చేశారు. కానీ చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు.
దీంతో నొచ్చుకున్న మొడియం నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. పార్టీ అధికారంలో ఉన్నా కూడ ఆయన మాత్రం ప్రభుత్వం తనది కాదన్నట్టు ఉండేవారు. దీంతో చంద్రబాబు ఆగ్రహించారు. మంత్రి వర్గంలో మార్పు చేసే అవకాశం వచ్చినా మొండియంను పక్క పెట్టేశారు. మొడియం తీరుతో రెండుసార్లు అండగా నిలిచి టికెట్ ఇప్పించిన మాగంటి బాబు సైతం ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితిని చక్కబెట్టుకోమని సలహా ఇచ్చారు. కానీ మొడియం వినలేదు. దాంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దొరకలేదు. ఎన్నికల తర్వాత పార్టీలో పదవి కూడ లభించలేదు. పరిస్థితిని గ్రహించిన శ్రీనివాస్ దారిలో పడినా కూడ మాగంటి బాబు కనికరించట్లేదు. ఈ పరిణామంతో సదరు మాజీ ఎమ్మెల్యే భవిష్యత్తు గాలిలో దీపమయ్యింది. అయినా కూడ ఎక్కడో చిన్న ఆశను పట్టుకుని పార్టీలోనే వేలాడుతున్నారు మొడియం శ్రీనివాస రావు.