తెలుగు రాష్ట్రాలకు సమ అన్యాయం: మోడీ సర్కారు తీరు ఇదీ.!

నెరవేర్చలేనివాటిని చట్టాల్లో ఎందుకు పొందుపరచడం.? అసలు చట్టాలంటే, విలువ లేకుండా పోతున్నదెందుకు.? ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించింది ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం. ఈ చట్టంలో అనేక అంశాలున్నాయి. అయితే, ఆయా అంశాలకు సంబంధించి మోడీ సర్కారు గడచిన ఎనిమిదేళ్ళుగా సందర్భానుసారం వక్రభాష్కం చెబుతూనే వస్తోంది.

‘ఫీజిబిలిటీ’ అని ఆయా అంశాలకు సంబంధించి ప్రస్తావన చేయడం మోడీ సర్కారుకి బాగా కలిసొచ్చింది. నిజానికి, చట్టాల రూపకల్పనలో ఇలాంటి పదాల ప్రయోగం కేవలం సాంకేతికం మాత్రమే. కడప స్టీలు ప్లాంటు అలాగే తెలంగాణలో స్టీలు ప్లాంటు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయ్.

విభజన చట్టంలో మరో కీలక అంశం, నియోజకవర్గాల పెంపు. దీనిపై మోడీ సర్కారు గడచిన ఎనిమిదేళ్ళుగా ఒకే పాట పాడుతోంది. అప్పుడప్పుడూ, నియోజకవర్గాల సంఖ్య పెరగనుందంటూ కేంద్రం సంకేతాలు పంపుతోంది. అంతలోనే, తుస్సుమనిపించేస్తోంది.

తాజాగా, ఇంకోసారి ఈ అంశం చర్చకు వస్తే, ‘ఇప్పట్లో కొత్త నియోజకవర్గాలు సాధ్యం కాదు..’ అని తేల్చేసింది. మొన్నటికి మొన్న, నియోజకవర్గాల సంఖ్య పెరబోతోందహో.. అంటూ ఢిల్లీ నుంచే లీకులు అందాయి. ఇప్పుడేమో ఇలా కేంద్రం చేతులెత్తేసింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడం వల్ల, ఆ విభజన చట్టంలో అంశాల గురించి కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాలు దేబిరించాల్సిన దుస్థితి వచ్చిందా.? అంటే, ఔననే అనుకోవాలేమో.!