ఒక్కోసారి అరుదైన పదవులు, గౌరవాలు పెద్దగా కష్టం లేకుండానే దక్కుతుంటాయి. అలాంటి అవకాశాలే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు దక్కుతున్నాయి. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు సీఐగా ఉన్న మాధవ్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ టీడీపీ నేత జేసి దివాకర్ రెడ్డితో జరిగిన గొడవతో ఆయన పేరు రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. అప్పుడు దివాకర్ రెడ్డి ఎంపీ స్థాయిలో ఉన్నారు. అలాంటి ఆయన మీదే మాధవ్ మీసం మెలేసి బస్తీ మే సవాల్ అనడం అందరినీ ఆకట్టుకుంది. ఆ పరిణామాల అనంతరం మాధవ్ పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.
వైఎస్ జగన్ ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించారు. కానీ చివరి నిముషం వరకు ఆయన నామినేషన్ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల నుండి ఇంకా రిలీవ్ కాలేదని, ఆయన నామినేషన్ చెల్లదని అన్నారు. కానీ చివరకు ఎలాగో ఆయనకు ఉద్యోగం నుండి విరామం లభించి నామినేషన్ ఆమోదం పొందింది. హిందూపురంలోని బలమైన కురువ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇలా ఊహించని రీతిలో కొన్ని నెలల వ్యవధిలోనే మాధవ్ ఎంపీ అయిపోయారు. అదే అదృష్టం అనుకుంటే తాజాగా ఆయనకు మరొక గోల్డెన్ ఛాన్స్ లభించింది. అదే ఇటలీ పార్లమెంట్ సమావేశాల్లోకి అడుగుపెట్టే అవకాశం.
పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా దేశంలో ఉన్న కొందరు ఎంపీలనియు ఎంపిక చేసి పలు దేశాల్లో ఉన్న పార్లమెంట్ వ్యవస్థలను, వాటి ప్రవర్తనను, పరిశీలించి, అధ్యయనం చేసి, వాటితో మైత్రీ బంధాన్ని నెలకొల్పే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా గోరంట్ల మాధవ్ కు ఇటలీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే అవకాశం లభించింది. అంతమంది ఎంపీల్లో మాధవ్ విదేశీ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందడం అదృష్టమే మరి.