గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసైనికులు టీడీపీకి ఓటేశారా.?

మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మూడింటినీ వైసీపీ గెలవాల్సి వున్నా.. వైసీపీలో వ్యూహాత్మక వైఫల్యం కాస్తా, ఆ పార్టీకి శాపంగా మారింది. ఎక్కడికక్కడ వైసీపీ స్థానిక నేతలు అలసత్వం ప్రదర్శించారు. కొందరేమో అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇక, ఈ మూడింటి గెలుపు విషయమై రకరకాల విశ్లేషణలు చోటు చేసుకోవడం సహజమే.

టీడీపీ పుంజుకుందనీ, ఇవే ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని టీడీపీ అంటోంది. టీడీపీ గెలుపులో తమవంతు పాత్ర పోషించామని జనసేన కూడా పరోక్షంగా చెబుతోంది. వైసీపీకి దారుణమైన నష్టమే జరిగింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కూడా చావు దెబ్బ తినేసిన మాట వాస్తవం. ఎమ్మెల్సీగా గతంలో పనిచేసిన మాధవ్ ఓడిపోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. మిత్రపక్షం జనసేన దెబ్బ కొట్టిందనీ గట్టిగా చెప్పలేక.. సహకరించినా ఓడిపోయామనీ చెప్పుకోలేక బీజేపీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

ఇంతకీ, జనసైనికులు ఎవరికి ఓటేశారు.? వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయమని జనసైనికులకు జనసేనాని పిలుపునిచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా వేయమంటే.. అది బీజేపీకి అనుకోవాలా.? ఔననే అంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. కానీ, జనసైనికుల ఓట్లు టీడీపీకి పడ్డాయి. టీడీపీని ఓ వైపు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా నానా తిట్లూ తిడుతున్నారు. టీడీపీ కూడా అంతే.

కానీ, వైసీపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలి గనుక.. మిత్రపక్షం బీజేపీకి వేస్తే ఓటు మురిగిపోతుంది గనుక.. టీడీపీకి ఓటేశారు. అదీ అసలు సంగతి. కానీ, ఇంతవరకు టీడీపీ అధినాయకత్వం, జనసేనానికి థ్యాంక్స్ చెప్పింది లేదు.