ఎమ్మెల్సీ ఫలితాలు – మూడు రాజధానులు… ఏవాదన కరెక్ట్?

తాజాగా విడుదలయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏపీలో కొత్త చర్చకు దారితీసాయి. అందులో ముఖ్యంగా మూడురాజధానుల అంశం ఈ సందర్భంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. మూడురాజధానులకు జనం మద్దతు లేదని, విశాఖకు రాజధాని తీసుకెళ్తానంటే ఉత్తరాంధ్ర వాసులు.. “అబ్బే ఛా మాకు రాజధాని వద్దు” అని అంటున్నారని టీడీపీనేతలు చెప్పుకుంటున్నారు. ఇక రాయలసీమకు న్యాయరాజధాని హోదా ఇస్తామంటే… “వద్దు సామీ.. మాకొద్దు.. బాబు చెప్పినట్లే అమరావతిలోనే ఉంచండి” అని సీమ జనాలు గట్టిగా వాదిస్తున్నారని చెబుతున్నారు బాబు & కో! మరి ఇందులో వాస్తవం ఎంత?

ఉత్తరాంధ్రలోనూ – రాయలసీమలోనూ గ్రాడ్యుయేట్లు టీడీపీ అనుకూల తీర్పునిచ్చారు అనేకంటే… ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేశారని చెప్పేకంటే… వ్యక్తులకు విలువ నిచ్చారని అంటున్నారు విశ్లేషకులు. రెగ్యులర్ గా చేసే రాజకీయ విశ్లేషణలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్తించవనేది వారి మాట! అంతకంటే ముఖ్యంగా… రాయలసీమలోనూ – ఉత్తరాంధ్రలోనూ వైకాపా బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం వల్ల మూడు రాజధానులకు వారంతా వ్యతిరేకం అన్న వాదనను కూడా తెరపైకి తెచ్చారు టీడీపీ నేతలు. అయితే.. ఇది, బోడి గుండుకీ – మోకాలికీ ముడిపెట్టడమే అంటూ… ఇందుకు వారు చెబుతున్న ఉదాహరణలు కూడా ఆలోచించచేసేలా ఉన్నాయి.

ఉదాహరణకు… గ‌తంలో గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబునాయుడు రాజ‌ధాని అంశంపై చెప్పిన విష‌యాన్ని గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు. ఈ రెండు కార్పొరేష‌న్ల ప‌రిధిలో వైసీపీని ఓడించి. తద్వారా, రాజ‌ధాని అమ‌రావ‌తికి పూర్తి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని చంద్ర‌బాబు వేడుకున్నారు. ఒక‌వేళ వైసీపీని గెలిపిస్తే, “అమరావతి వద్దు – మూడు రాజ‌ధానులు ముద్దు” అని జగన్ నిర్ణయానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ట్టే అని బాబు నాడు అన్నారు. సో… రాజ‌ధాని భ‌విష్య‌త్తు గుంటూరు, విజ‌య‌వాడ కార్పొరేష‌న్ల ప‌రిధిలోని ఓట‌ర్ల చేతిలో వుంద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఆ రెండు కార్పొరేష‌న్ల‌లో వైసీపీకే ప‌ట్టం కట్టారు ఆ రెండు జిల్లాల ప్రజలు!

అంటే… వారికి అమరావతిపై ప్రేమ లేదని అనుకోవాలా? మాకు అమరావతిలో రాజధాని వద్దు బాబూ… విశాఖకు తరలించేయండి – సీమకు పంపించేయండి అని తీర్పునిచ్చినట్లు భావించాలా? నేడు ఇది కరెక్ట్ అయితే.. నాడు అది కరెక్ట్! నాడు అది తప్పైతే – నేడు ఇదీ తప్పే! అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే… ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప‌రిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపోటములకు అనేక కార‌ణాలున్నాయి. దానికి రాజ‌ధానితో ముడిపెట్ట‌డం, ఆ ప్రాంత ప్రజలు రాజధాని తమకొద్దని చెప్పారని చెప్పడం సరైన ఆలోచన కాదనేది వారి వాదన!

మరి చంద్రబాబు చెబుతున్నట్లు సీమవారికి న్యాయరాజధాని – ఉత్తరాంధ్ర ప్రజలకు పరిపాలనా రాజధాని వద్దన్నది నిజమేనో కాదో రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కానీ పూర్తి స్పష్టత రాదన్నమాట. అప్పుడు ప్రజలు బాబుకు పట్టం కడితే.. ఎలాగూ మూడు రాజధానుల ఫైల్ అటకెక్కేస్తాది. జగన్ కి జై కొడితే.. బాబు రిటైర్ మెంట్ ప్రకటించేయొచ్చు!!