జనసేన వైపుగా అడుగులేస్తున్న ఎమ్మల్యే శ్రీదేవి.?

ఇసుక కుంభకోణాలకి పాల్పడి, పేకాట క్లబ్బులు నడిపిన ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవిని తీసుకోవద్దంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే సెగ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైపుకు తిరిగిన సంగతి తెలిసిందే.

‘అబ్బే, అదేం లేదు. నేను వైసీపీకే ఓటేశా..’ అని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. కానీ, 15 కోట్లకు ఎమ్మెల్యే శ్రీదేవి అమ్ముడుపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ పంచాయితీ ఇప్పట్లో తేలేది కాదు.! ఇంతకీ, ఎమ్మెల్యే శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.? టీడీపీలోనా.? జనసేనలోనా.? బీజేపీలోనా.?

టీడీపీలోనే ఎమ్మెల్యే వుండవల్లి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, ఆమెను కోవర్టుగా అభివర్ణిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. దాంతో, శ్రీదేవి జనసేన వైపు చూడబోతున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది. వాస్తవానికి, ఎమ్మెల్యే శ్రీదేవి అవినీతిపై గట్టిగా నిలదీసింది జనసేన పార్టీనే. కానీ, కాపు – దళిత ఈక్వేషన్ వుంది ఎమ్మెల్యే శ్రీదేవి కుటుంబంలో. ఆమె భర్త కూడా వైద్యుడే. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2019 ఎన్నికల్లో ఈ ఈక్వేషన్ నేపథ్యంలోనే ఆమెకు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. సో, ఇదే ఈక్వేషన్ జనసేన నుంచి అయితే మరింత బాగా వర్కవుట్ అయ్యే అవకాశం వుంటుందట.

ఇదిలా వుంటే, బీజేపీ కూడా ఎమ్మెల్యే శ్రీదేవికి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి రక్షణ కావాలంటే బీజేపీలో చేరాలంటూ బీజేపీ నేతలు కొందరు ఆమెను సంప్రదించారట. మరి, వుండవల్లి శ్రీదేవి భవిష్యత్ కార్యాచరణ ఎలా వుంటుందో ఏమో.!