అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై ఆదివారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇరువురు మరణించారు. ఈ కాల్పులు మావోయిస్టు అగ్రనేత ఆర్కే…అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ నేతృత్వంలో దళ కమాండర్ చలపతి అమలు చేసినట్టు అంతా భావించారు. రెండు రోజులుపాటు విశాఖ మన్యంలో మావోల వారోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వారంతా ఈ నిర్ణయానికి వచ్చి దాడి చేసినట్టు భావిస్తున్నారు.
కానీ ఈ దాడిలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిడారి, సివేరిపై కాల్పులు జరిపింది ఇటీవల ఏర్పడిన మావోయిస్టు మహిళా దళమే అని తెలుస్తోంది. నందాపూర్ ఏరియా కమిటీ అని పోలీసులు నిర్ధారించారు. ఈ దళానికి చైతన్య అలియాస్ అరుణ నాయకత్వం వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. అరుణ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా… నారాయణపట్నం ఏరియా కమిటీ బాధ్యతలు చూస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
దాడికి పాల్పడిన వారిలో డివిజినల్ కమిటీ మెంబర్ రింకీ అలియాస్ స్వరూప, రైనో అలియాస్ సునీల్ ఆధ్వర్యంలో మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు ధృవీకరించారు. అరుణ మావోయిస్టు చలపతి భార్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అప్పటి మంత్రి మని కుమారి భర్త వెంకటరాజును నక్సల్స్ హతమార్చారు. అలాగే హుకుంపేట ఎంపీపీ, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సమిడ రవిశంకర్, ఎంపీపీ చిట్టిబాబును కాల్చి చంపేశారు.