జనసేనలోకి ఎమ్మెల్యే గంటా.! నిజమెంత.!

అదిగో పులి.. ఇదిగో తోక.! ఇది నాలుగేళ్ళుగా జరుగుతున్న ప్రచారమే.! ఆ ప్రచారానికి తగ్గట్టుగా లీకులు ఇస్తున్నదీ ఆయనగారే.! పరిచయం కొత్తగా అవసరం లేని పేరది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి ఆయన అనుచరులకే పెద్దగా అర్థం కాదు.

కానీ, రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేయడంలో దిట్ట ఆయన. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోతారాయన. అయితే, అది ఒకప్పుడు. వైసీపీలో చేరేందుకు నానా రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు 2019 ఎన్నికల తర్వాత గంటా శ్రీనివాసరావు. అవంతి శ్రీనివాసరావు గనుక వైసీపీలోకి వచ్చి వుండకపోతే, గంటా ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా వుండేవారు. ఎక్కడో వ్యవహారం తేడా కొట్టింది.

అవంతిని వైసీపీ నుంచి తప్పించి, తాను వైసీపీలో దూరాలని నాలుగేళ్ళుగా ప్రయత్నంచి భంగపడ్డారు గంటా. కానీ, ఇంతలోనే మనసు మార్చుకున్నారు. టీడీపీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ళ క్రితం వరకు చంద్రబాబు విశాఖ పర్యటనల్ని పట్టించుకోని గంటా, ఇప్పుడు పార్టీ శ్రేణులకు బాగా దగ్గరయ్యారు.

మళ్ళీ అనూహ్యంగా వ్యూహాలు మారుస్తున్నారు. జనసేన వైపుగా అడుగులేస్తున్నారు. ఇవి కూడా జస్ట్ లీకులు మాత్రమేనా.? లీకులు ఇచ్చి, వాస్తవ పరిస్థితిని అంచనా వేసే ప్రక్రియేనా.? ఏమోగానీ, త్వరలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్న దరిమిలా, ఆ పర్యటనలోనే గంటా తన మార్కు రాజకీయం చేయబోతున్నారన్నది తాజా ఖబర్.

చిరంజీవి ద్వారా గంటా, పవన్ కళ్యాణ్‌ని కలిసేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న మాట వాస్తవం. కానీ, కుదరడంలేదు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. పోటీ చేసే అభ్యర్థుల పరంగా కొంత సమస్య వుంది జనసేనకి. గంటా లాంటివాళ్ళు వస్తే, అది జనసేనకి అడ్వాంటేజ్ అవుతుంది.