జనసేన ఎఫెక్ట్… టీడీపీలో ఫస్ట్ వికెట్ డౌన్!

రాబోయే ఎన్నికల్లో ప్రతిఫలం సంగతి దేవుడెరుగు కానీ.. టీడీపీ – జనసేన పొత్తు ప్రభావం తమ్ముళ్లు అప్పుడే రుచి చూసేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే టీడీపీ నుంచి ఫస్ట్ వికెట్ డౌన్ అయిపోయిందనే కామెంట్లు మొదలైపోయాయి. దానికి కారణం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. తాజాగా ఈయన ఇచ్చిన స్టేట్ మెంట్ తో తెనాలి టీడీపీ కార్యకర్తలు టెన్షన్ పడిపోతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను తెనాలి నుంచినే పోటీ చేయనున్నట్లు ప్రకటించుకున్నారు జ‌నసేన ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్. తెనాలి నుంచి ఇప్పటికే రెండుసార్లు పోటీచేశారు మనోహర్. 2004లో ప‌న్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన, 2009లో మాత్రం రెండు వేల స్థాయి మెజారిటీతో బ‌య‌ట‌పడ్డారు. ఆ సమయంలోనే ఆయ‌న‌కు డిప్యూటీ స్పీక‌ర్ గా అవ‌కాశం ద‌క్కింది. స్పీక‌ర్ హోదా నుంచి కిర‌ణ్ కుమార్ రెడ్డి సీఎం అయిపోవ‌డంతో, నాదెండ్ల మ‌నోహ‌ర్ కు ఆ ఛాన్సు ద‌క్కింది.

అయితే జనసేన – టీడీపీ పొత్తు కన్ ఫాం అని కథనాలొస్తున్న నేపథ్యంలో… జనసేనకు టీడీపీ ఏయే సీట్లు ఆఫర్ చేసిందో ఇంతవరకూ వెలుగులోకి రాలేదు. అయితే తెనాలి నుంచి మాత్రం తాను పోటీ చేస్తానని నాదెండ్ల స్వయంగా ప్రకటించేసుకున్నారు. దీంతో… తెనాలి సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆల‌పాటి రాజేంద్రప్రసాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2014, 2019లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెనాలి నుంచి పోటీ చేశారు. 2014లో సుమారు 93,524 ఓట్లు సాధించి 19,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2019 జగన్ వేవ్ లో కూడా 76,846 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో పోటీచేసిన మనోహర్.. 29,905 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో… అంత బలమైన నేతను కాదని మనోహర్ కి బాబు సీటు ఇస్తారా? పొత్తులో భాగంగా ఆలపాటి వంటి సీనియర్లను బలి చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. దీంతో… జనసేనతో పొత్తు ఫలితంగా టీడీపీలో మొదటి వికెట్ పడిందని ఆన్ లైన్ వేదికగా కామెంట్లు కనిపిస్తున్నాయి!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… జనసేన అధినేతే ఇప్పటివరకూ తాను ఎక్కడి నుంచి పోటీచేసేది బహిరంగ పరచలేదు. కానీ… ఒక పక్క పొత్తు చర్చలు నడుస్తున్నాయి, మరో పక్క జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తున్నారనేదానిపై ఇంకా టీడీపీ నుంచి క్లారిటీ రాలేదు. కానీ, ఇంతలోనే నాదెండ్ల మనోహర్ మాత్రం… తన సీటును తానే ప్రకటించేసుకున్నారు.