ఏపీలో మహిళల మిస్సింగ్… కేంద్రం చెప్పని విషయం చెప్పిన డీజీపీ!

ఏపీలో మహిళల అదృశ్యంపై జనసేన అధినేత చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా మహిళలౌ అదృశ్యమైన కేసులను ఉమన్ ట్రాఫికింగ్ గా మలిచి మాట్లాడుతూ… అందుకు వాలంటీర్లు కారణం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవేమి కారు కూతలు అంటూ వాలంటీర్లు ఫైరయ్యారు.

ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. అయితే తాజాగా ఇదే అంశం పైన పార్లమెంట్ లో కేంద్రం లెక్కలు వెల్లడించింది. అయితే ఏపీ కంటే తెలంగాణలో ఇలాంటి కేసులు ఎక్కువని తెలిపింది. ఇదే సమయంలో జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉందని క్లారిటీ ఇచ్చింది. అయితే కేంద్రం ఇచ్చిన లెక్కలపై తాజాగా ఏపీ డీజీపీ స్పందించారు.

అవును ఏపీలో మహిళలు, బాలికల అదృశ్యం కేసుల వివరాలపై కేంద్రం పార్లమెంటులో వివరణ ఇచ్చిన అనంతరం ఏపీ డీజీపీ స్పందించారు. మిస్సింగ్ కేసుల గురించి చెప్పారే కానీ… ఆ మహిళలను గుర్తించి తిరిగి ఇళ్లకు చేర్చిన కేసులను మాత్రం వివరించలేదన్నట్లుగా ఫుల్ క్లారిటీ ఇచ్చారు! రాష్ట్రంలో ముప్పై వేల మంది మిస్సింగ్ అయింది అవాస్తవమని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేసారు. ఆరోపణలు చేసే ముందు నివేదికలు చూసి మాట్లాడాలని సూచించారు.

ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 26వేల మంది మిస్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. ఇదే క్రమంలో… మిస్సింగ్ అయిన వారిలో 23, 354 మందిని ఇప్పటికే గుర్తించామని వెల్లడించారు. ఇక మిగిలిన మహిళలు 2,700 మంది మాత్రమేనని తెలిపిన డీజీపీ… వారిని కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. వివిధ సామజిక కారణాల రిత్యా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని డీజీపీ స్పష్టం చేశారు.

అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో గంజాయి పంట విపరీతంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా డీజీపీ సీరియస్ గా స్పందించారు. రాష్ట్రంలో ఏ కేసు నమోదైనా దాన్ని గంజాయికి ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 7,500ఎకరాల్లో గంజాయి సాగును గుర్తించి నిర్మూలించామని చెప్పారు.

ఇదే సమయంలో గత నాలుగేళ్ళతో పోలిస్తే ఆరు నెలల కాలంలో క్రైమ్ బాగా తగ్గిందని వివరించారు. వీటికి సంబంధించిన వివరాలు తెలిపిన డీజీపీ.. 36శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని.. వరకట్న వేధింపుల కేసులో కూడా చాలా తగ్గుముఖం పట్టాయని.. దిశా స్టేషన్ ల ఏర్పాటుతో మరింత పురోగతి సాధించామని వివరించారు.

అనంతరం రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని చెప్పిన డీజీపీ… సైబర్ క్రైమ్ అదుపులోకి పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్టేషన్ లను ఏర్పాటు చేసామని.. రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని.. సోషల్ మీడియా గ్రూప్ లను మానిటర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు.