మిర్యాలగూడ అమృత ప్రణయ్ కి దంపతులు షాక్ ఇవ్వబోయి రివర్స్ షాక్ తో కటకటాలపాలయ్యారు. అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించిన సంగతి తెలిసిందే. పటాన్ చెరువుకు చెందిన దంపతులు ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామని అమృతకు చెప్పటంతో వారి పై అనుమానంతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు కథేంటంటే…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు మిర్యాలగూడకు చేరుకొని అమృతను కలిశారు. ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని నీతో కూడా ప్రణయ్ ఆత్మను మాట్లాడిస్తామని ఆమెకు చెప్పారు.
వచ్చే జన్మలో కూడా ప్రణయ్ నీతోనే జీవించాలనుకుంటున్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు. మారుతీరావు, ప్రణయ్ గత జన్మలో శత్రువులని ఈ జన్మలో పగ తీర్చుకోవడానికే మారుతీరావు ప్రణయ్ ని చంపించాడు తప్పా ఏ పగ లేదని చెప్పారు.
ప్రణయ్ ఆత్మ ఇంటి చుట్టే తిరుగుతుందని, అతని విగ్రహం పెట్టిస్తే అతని ఆత్మ అందులోనే బంధి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ దంపతుల ప్రవర్తనపై అనుమానం కలిగిన అమృత మిర్యాలగూడ డిఎస్పీకి ఫోన్ లో విషయాన్ని చెప్పింది. డిఎస్పీ ఆదేశాలతో సీఐ నాగరాజు ప్రణయ్ ఇంటికి చేరుకొని ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
అసలు వీరిని ఎవరు పంపించారు, ఎందుకు వచ్చారు, విగ్రహం పెట్టొద్దని చెప్పారంటే వీరిని ఎవరో పంపించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రణయ్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అల్లుడు ప్రణయ్ ని కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతం వారు జైలులో రిమాండ్ లో ఉన్నారు. అమృత ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. ప్రణయ్ కి న్యాయం జరగాలని జస్టిస్ ప్రణయ్ పేరుతో అమృత ఫేస్ బుక్ పేజిని కూడా ప్రారంభించి పోరాడుతుంది.
మరో వైపు అమృత తండ్రి మారుతీరావు చేసిన పని కరెక్టె అని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు కూడా వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో అమృత ఫిర్యాదు చేయగా పోలీసులు ఓ యువకుడిని కూడా అరెస్టు చేశారు.
అమృతకు దేశ వ్యాప్తంగా పలు సంఘాలు, రాజకీయ నాయకులు, అండగా నిలిచారు. ప్రణయ్ హత్య నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. పటాన్ చెరువు నుంచి వచ్చిన దంపతులు ప్రణయ్ కుటుంబానికి ఏదైనా హాని తలపెట్టడానికే వచ్చారా అనే అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే వీరు వచ్చి నమ్మించారా అనే అనుమానాలు ప్రణయ్ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆత్మలు ఉన్నాయా… వీరు ధైర్యంగా ఇంటికి వచ్చి ఆత్మలున్నాయి. తమతో ప్రణయ్ ఆత్మ మాట్లాడుతుంది. నీతో కూడా మాట్లాడిస్తానమ్మా అని అమృతను నమ్మించారు. ప్రణయ్ విగ్రహం పెట్టొద్దు, పెడితే ఆత్మ అందులో బందీ అయితుంది అని చెప్పటంతో అమృతకు అనుమానం కలిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రణయ్ విగ్రహం పెట్టవద్దని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. వారే కావాలని పంపించి విగ్రహం పెట్టవద్దని చెప్పించారేమో అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా ప్రణయ్ కేసులో మరో మలుపు తిరిగింది.