ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఓ వింత ఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలోని జాన్ బాద్ తండాలో నివాసం ఉంటున్న ఏనుగుల ఉపేంద్రమ్మ అనే మహిళకు గత నాలుగు నెలలుగా బానోతు వెంకన్న అనే వ్యక్తికి చెందిన పొలంలో దుర్గామాత కొలువై ఉన్నట్టు కలలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని వెంకన్నకు పలుమార్లు చెప్పినా, ఆయన తొలుత పట్టించుకోలేదు. తవ్వకాలు జరిపేది లేదని వ్యతిరేకించాడు. పొలంలో తవ్వకాలు జరిపి చూడాలని ఆమె పట్టుబట్టగా, చివరికి వెంకన్న అంగీకరించి, నలుగురి సమక్షంలో తవ్వకాలు జరిపించాడు. తవ్వకాల్లో ఓ దుర్గామాత విగ్రహం బయటపడింది. మహిళ కలలో వచ్చినట్టుగా నిజంగా విగ్రహం బయటపడటంతో అంతా షాక్ కు గురయ్యారు.
దీంతో దుర్గమ్మ తమను ఆదుకునేందుకు స్వయంభువుగా వెలిసిందని గ్రామస్థులు, చుట్టు పక్కల ప్రజలు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ గుడి కడతామని వారు స్పష్టం చేశారు.
ఇక పెద్దఎత్తున భక్తులు వస్తుండటంతో, విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి, పురావస్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలో శివాలయం ఉండేదని ఇక్కడి వారు అంటున్నారు.