చిత్తూరులో మైనారిటీ నేత రాజీనామా..టిడిపి షాక్

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులోనే తెలుగుదేశంపార్టీకి  షాక్ తగిలింది. దాదాపు పాతిక సంవత్సరాలుగా పార్టీలోనే పనిచేసిన మైనారిటీ నేత ఇక్బాల్ మొహమ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. ఒకవైపు షెడ్యూల్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో సొంత జిల్లాలోని నేతలే రాజీనామా చేస్తున్నారంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్బాల్ జిల్లాలోని పీలేరు నియోజకవర్గానికి చెందిన నేత. పోయిన ఎన్నికల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి వ్యతిరేకంగా పోటీ చేసినట్లు ఇక్బాల్ చెప్పారు. నల్లారి కుటుంబంపై పోటీ చేయాలని చంద్రబాబు ఒత్తిడి తెస్తేనే తాను పోటీ చేసినట్లు ఇఫుడు చెప్పటం గమనార్హం. ఇక్బాల్ నే చంద్రబాబు ఎందుకు ఒత్తిడి చేశారంటే మైనారిటీ ఓట్ల కోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే, పీలేరులో మైనారిటీ ఓట్లు బాగానే ఉన్నాయి.

 

నల్లారి కుటుంబంపై పోటీ చేసేటపుడు తనకు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ ఇఫుడు మండిపడుతున్నారు. పోటీ చేసి ఓడిపోయినా పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిపదవితో సమానమైన కార్పొరేషన్ ఇస్తానని హామీ ఇచ్చారట. సరే ఇటువంటి హామీలు చంద్రబాబు చాలామందికే చాలానే ఇచ్చుంటారు. అందులో ఇక్బాల్ కూడా ఒక్కళ్ళు. సహజంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళని మరచిపోయినట్లుగానే ఇక్బాల్ ను కూడా మరచిపోవటంతో పాటు దూరంగా పెట్టేశారట. అది ఇపుడు ఈ మైనారిటీ నేత కోపానికి కారణం.

 

నల్లారి కిషోర్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకునేటపుడు కూడా తనకు కార్పొరేషన్ పదవి ఇస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయితే, కార్పొరేషన్ పదవి ఇవ్వకపోగా ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి పదవిని కూడా ఊడబీకేశారు. అంతేకాకుండా నల్లారి కిషోర్ ను ఇన్చార్జిని చేయటంతో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా కట్టబెట్టారు. దాంతో ఇక్బాల్ కు పుండు మీద కారం రాసినట్లైంది. అప్పటి నుండి ఇక్బాల్ మండుతున్నారు. చివరకు వేరే దారిలేక టిడిపికి రాజీనామా చేసేశారు. బహుశా వైసిపిలో చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.