రాబోయే ఎన్నికల్లో అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి అభ్యర్ధుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుంది. చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్ధుల మధ్య గట్టిపోటీ నడుస్తోంది. ఇటువంటి నేపధ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ పై చర్చ మొదలైంది. అదేమిటంటే, మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు ఓడినా వారికి మాత్రం మంత్రి పదవి ఖాయమే అని.
టిడిపి తరపున నారావారి పుత్రరత్నం నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. వైసిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. మామూలుగా అయితే ఆళ్ళ ముందు లోకేష్ ఏ విషయంలోను సరిపోరు. కేసులతో చంద్రబాబునాయుడునే ముప్పు తిప్పలు పెడుతున్న చరిత్ర ఆళ్ళకుంది. ఒకవిధంగా చంద్రబాబుకు ఆళ్ళ నిద్రలేకుండా చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇటువంటి నేపధ్యంలో ఆళ్ళపై లోకేష్ పోటీకి దిగారు. సరే నామినేషన్ వేసిన దగ్గర నుండి ప్రచారంలో భాగంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లోకేష్ జనాలను బాగా ఎంటర్ టైన్ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. సరే ప్రస్తుతానికి వస్తే ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా మంత్రిపదవి అయితే ఖాయమట.
ఎలాగంటే, వైసిపి గెలిచినా ఆళ్ళ ఓడిపోయారనుకోండి జగన్మోహన్ రెడ్డి ఆళ్ళకు ఎంఎల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే మళ్ళీ టిడిపినే గెలిచి లోకేష్ ఓడిపోయినా మంత్రిపదవి ఎటూ ఖాయమే కద. ఒకవేళ వైసిపి అధికారంలోకి వచ్చి, ఆళ్ళా గెలిచారునుకోండి ఇక గొడవే ఉండదు. మొత్తం నియోజకవర్గాల్లోకి మంగళగిరికున్న ఈ ప్రత్యేకత ఇంకదేనికీ లేదు కదా ?