వైసీపీలో నాయకులకు కొదవే లేదు. పదవులు ఖాళీ లేవు కానీ వాటిని అలంకరించడానికి వందల మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు వైసీపీలో. అయితే ఇంతపెద్ద పదవి అయినా జగన్ కోటరీలో పదవుల ముందు దిగదుడుపే అన్నట్టు ఉంది వ్యవహారం. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఎమ్మెల్యేలకు జగన్ వద్ద అంత సీన్ లేదని అర్థమైపోయింది. వారికే ముఖ్యమంత్రిని కలవడం గగనంలా ఉంది. గెలుచు రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి తన బాధలను చెపుకోలేకపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కానీ వైసీపీలో గ్రౌండ్ రియాలిటీ ఇదే. ఎంపీలు కూడ ఇందుకు మినహాయింపేమీ కాదు. వీరికి కూడ జగన్ దొరకట్లేదు. వ్యవహారాలన్నీ సీఎం కోటరీలోనే ఫైనల్ అయిపోతున్నాయి.
ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం తరచూ ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. సీఎంఓకు వెళ్తూ వస్తూ ఉన్నారు. అది చూసి మంత్రుల పని బాగుంది. కావాల్సినప్పుడల్లా ముఖ్యమంత్రిని కలిసొస్తున్నారు. వీరి మాట జగన్ పేషీలో బాగా చెలామణీ అవుతున్నట్లుంది అనుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే మంత్రులను చూసి ఈర్ష్యపడ్డారు. ముఖ్యమంత్రితో ఏ పని కావాలన్నా మంత్రుల వద్దకు వెళ్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు వెనకపడుతుండటం మంత్రులకు మంచి మైలేజ్ ఇచ్చే విషయమే. పరపతి బాగా పెరుగుతుంది. కానీ వైసీపీలో అలా కాదు. నిత్యం సీఎంఓకు వెళ్లి వస్తున్న మంత్రుల బాధలు అన్నీ ఇన్నీ కావట. ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు తాము కూడ చేధించలేని కోటరీ ఒకటి జగన్ చుట్టూ ఉందని మంత్రులు అంటున్నారట.
వాళ్లకు అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులోకి వస్తారట సీఎం. ఆ అప్పుడప్పుడు కూడ కోటరీ అనుగ్రహం ఉంటేనే సాద్యమవుతోందట. కోటరీలో సజ్జల, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, బుగ్గన లాంటి ఏడెనిమిది మంది కీలక వ్యక్తులు ఉన్నారట. అంతా వీరి పరిధిలోనే జరుగుతోందట. మంత్రులు సీఎంవోకు వెళితే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని ఫేస్ చేయాల్సి వస్తోందట. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినా ఆయన సీఎం కార్యాలయానికి ఏ మంత్రి వెళ్లినా పనేమిటి కనుక్కోవడం, ఎందుకు, ఎలా అంటూ ప్రశ్నించడం, అప్పుడపుడు అభ్యంతరాలు పెట్టడం చేస్తున్నారట. ఆయన్ను దాటితేనే సీఎం వద్దకు వెళ్లగలరట. మొదట్లో దీన్ని పర్వాలేదని అనుకున్నా పదే పదే సజ్జల ఎంక్వైరీలను తట్టుకోలేకపోతున్నామని మంత్రులు లోపల్లోపలే మదనపడుతున్నారట. అలాగని ఎవరిముందైనా బాధను వెళ్లగక్కితే పరువు పోతుందని మౌనంగానే ఉంటున్నారట.