మంత్రి శ్రవణ్ రాజీనామా ?

వైద్య, గిరిజన శాఖల మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామా చేయక తప్పని పరిస్ధితి వచ్చింది. ఎంఏల్ఏ, తండ్రి అయిన కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో మరణించటంతో శ్రవణ్ కు హఠాత్తుగా కారుణ్య నియామకంలో భాగంగా మంత్రి పదవి వచ్చింది. చట్ట సభల్లో ఎక్కడా సభ్యుడు కాకపోయినా చంద్రబాబునాయుడు శ్రవణ్ ను మంత్రిగా చేశారు.

మంత్రి పదవి అయితే ఇచ్చారు కానీ చట్ట సభలో సభ్యునిగా మాత్రం చేయలేదు. దాంతో ఇపుడు మంత్రి రాజీనామా చేయక తప్పని పరిస్ధితి తలెత్తింది. పోయిన ఏడాది నవంబర్ 11వ తేదీన శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఆరుమాసాల్లోగా అంటే ఈనెల 11వ తేదీలోగా ఎంఎల్ఏగా కానీ ఎంఎల్సీగా కానీ అవ్వాలి. అయితే ఉభయ సభల్లో ఎందులో కూడా మంత్రి సభ్యుడు కాలేదు.

మంత్రయిన ఆరుమాసాల్లోగాఉభయ సభ్యుల్లో ఎందులోను సభ్యుడు కాకపోతే సదరు వ్యక్తి మంత్రి పదవిని కోల్పోతారు. ఇపుడిదే సమస్య శ్రవణ్ విషయంలో తలెత్తింది. శ్రవణ్ మంత్రియిన తర్వాత ఎంఎల్సీగా ఎన్నికయ్యే అవకాశం వచ్చినా చంద్రబాబు మాత్రం ఆ విషయాన్ని ఆలోచించలేదు.

గతంలో బామరిది నందమూరి హరికృష్ణ విషయంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. 1996లో హరికృష్ణకు రవాణాశాఖ మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు ఎంఎల్ఏగా కానీ ఎంఎల్సీగా కానీ చేయలేదు. దాంతో ఆరుమాసాలవ్వగానే హరికృష్ణ అవమానకరంగా మంత్రి పదవి నుండి దిగిపోవాల్సొంచ్చింది. అదే విషయాన్ని రాజ్ భవన్ చంద్రబాబుకు సూచిచింది. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో శ్రవణ్ రాజీనామా తప్పదని తేలిపోయింది.