ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్సీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరవ్వాలని ఆమె సవాల్ విసిరారు. ప్రజల సమస్యలపై మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జగన్‌కు హితవు పలికారు.
“ప్రజల తరపున నిలబడి మాట్లాడలేని జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని” మంత్రి సంధ్యారాణి ప్రశ్నించారు. గతంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేశామని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం చేసిందని ఆమె ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు చేసిన ప్రజా వ్యతిరేక పనుల వల్లే ఎన్నికల్లో ఓడిపోయారని ఆక్షేపించారు. వైఎస్సార్సీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.
అరకు కాఫీపై సమీక్ష, కొత్త ఒప్పందాలు: మంగళవారం విశాఖపట్నంలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్లో అరకు కాఫీ పంటపై మంత్రి సంధ్యారాణి సమీక్ష సమావేశం నిర్వహించారు. అరకు కాఫీ అభివృద్ధి, బెర్రీ బోరర్ తెగులుపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడిస్తోందని, దాని విస్తృతి కోసం 18 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు మానస పుత్రికగా అరకు కాఫీ ముందుకు వెళ్తుందని ఆమె ఉద్ఘాటించారు. అరకు కాఫీకి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్లలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
80 ఎకరాల కాఫీ తోటల్లో బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తి చెందిందని సంధ్యారాణి వెల్లడించారు. ఈ తెగులు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్న తరుణంలో వైరస్ సోకడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 1.86 లక్షల ఎకరాల్లో కాఫీ పంటను గిరిజన రైతులు సాగుచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో గంజాయికి దూరంగా ఉండి, కాఫీ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారని వివరించారు. బెర్రీ బోరర్ తెగులు వ్యాప్తితో నష్టపోయిన కాఫీ పంటకు కేజీకి రూ.50లు పరిహారం గిరిజన రైతులకు అందజేస్తున్నామని ప్రకటించారు.
భవిష్యత్ ప్రణాళికలు: “కాఫీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బెర్రీ బోరర్ తెగులు నివారణపై దృష్టి పెట్టాం. అరకు కాఫీ బ్రాండ్ ఎప్పటికీ పడిపోదు. కాఫీ రైతులు ఇబ్బందులు పడకుండా పరిహారం అందిస్తున్నాం” అని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1300 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించామని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్లపై కనీసం దృష్టి పెట్టలేదని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో జ్వరం, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా దృష్టి పెట్టామని తెలిపారు.
త్వరలోనే హైడ్రో పవర్ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలను తీసుకుంటామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.


