‘మీరు హీరో అని చెప్పుకోవడానికి సినీ పరిశ్రమలో చాలామంది సిగ్గు పడుతున్నారు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 45 సీట్లు వస్తాయంటూ జోస్యం చెబుతున్న పవన్ కళ్యాణ్, ముందైతే జనసేన పార్టీకి మొత్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సీన్ వుందో లేదో తేల్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు.
‘ఆంధ్రప్రదేశ్ పందుల దొడ్డి కాదు.. వైఎస్ జగన్ అడ్డా..’ అంటూ మంత్రి రోజా తనదైన స్టయిల్లో సినిమాటిక్ డైలాగ్ పేల్చారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లనూ వైసీపీ గెలుచుకుంటుందనీ, సంక్షేమ పథకాల అమలులో వైఎస్ జగన్‌కి సాటి ఇంకెవరూ రారని చెప్పుకొచ్చారామె.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయంటూ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అసలు జనసేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు..’ అంటూ కొందరు మంత్రులు స్పందిస్తున్నారు. నిజానికి, ఆ స్పందనే కరెక్ట్.!
కానీ, కొందరు మంత్రులు మాత్రం అధినేత మెప్పు కోసం, జనసేన పార్టీకి అనవసర ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా, మంత్రి రోజా లాంటోళ్ళు కూడా జనసేన పార్టీని ఇంత సీరియస్‌గా తీసుకోవడం ఒకింత ఆశ్చర్యమే. రెండు చోట్లా ఓడిపోయిన జనసేన అధినేత మీద విమర్శలు చేయడానికి మంత్రులు అవసరమా.? అన్న కోణంలో వైసీపీ అధినాయకత్వం ఒకింత ప్రత్యేక శ్రద్ధ పెడితే మంచిదేమో.!
ఇంతకీ, జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో 175 సీట్లలోనూ పోటీ చేస్తుందా.? అది ఆ పార్టీ అంతర్గత విషయం.! అయినాగానీ, వైసీపీ మీద జనసేన విమర్శలు చేస్తోందిగనుక, వైసీపీ నుంచి వచ్చే ప్రశ్నకి జనసేన సమాధానం చెప్పి తీరాల్సిందే కదా.!