ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆమెకు… కాలు వాపు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో కూర్చోవడానికి సైతం ఇబ్బందిగా మారిందని తెలుస్తుంది. దీంతో మరో రెండు రోజులు చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత రోజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఇంటివద్ద విశ్రాంతి సీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు!
వెన్నెముక, కాలు సమస్య బాధిస్తుండటంతో చెన్నై అపోలో లో గతంలోనే రోజా శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి నొప్పి రావడంతో ఇంటి వద్దే ఉంటూ ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా ఈ నెల 2న పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కు హాజరుకాలేకపోయారు. దీంతోపాటు ఈ నెల ఏడో తేదీన విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశానికీ కూడా మంత్రి హాజరుకాలేదు.
ఇలా కీలకమైన సమావేశాలకు, కార్యక్రమాలకు సైతం హాజరుకాలేకపోయినా.. ప్రస్తుతం చెన్నైలో హాస్పటల్ లో ఉన్నా కూడా ప్రజా సమస్యలపై మాత్రం బాగానే స్పందిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిన విషయంపై రోజా కీలకంగా రియాక్ట్ అయ్యారు.
ఇందులో భాగంగా పంచ్ ప్రసాద్ విషయాన్ని వెంటనే ఏపీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేయాలని సూచించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రోజాపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇదే సమయంలో రోజా కూడా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు.
“డియర్ #PunchPrasad నువ్వు ఎప్పటిలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ మళ్ళీ మా ముందుకు రావాలి, ఆరోగ్యరీత్య మీకు ఏ అవసరం ఉన్నా మేము చూసుకుంటాము. మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అడిగిన వెంటనే స్పందించి అవసరమైన సాయం చేసి ఆదుకున్న జగనన్నకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. #YSJaganCares” అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు.