కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు… అల్జీమర్స్ ఎఫెక్ట్ అంటూ రోజా ఫైర్!

విపక్ష సభ్యులపై వైసీపీ విమర్శలందు మంత్రి ఆర్కే రోజా విమర్శలు వేరయా అంటుంటారు విశ్లేషకులు. అటు పవన్ పై అయినా ఇటు చంద్రబాబుపై అయినా రోజా ఫైరవ్వడం మొదలుపెడితే… మైకులు వేడెక్కిపోవాల్సిందే అంటుంటారు ఆమె అభిమానులు. ఈ సమయంలో తాజాగా మరోసారి మైకందుకున్నారు రోజా!

అవును.. గత రెండు రోజులుగా చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు రాయలసీమ వెనుకబడిపోవడానికి జగనే కారణం అని కూడా అంటున్నారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు. ఇదే సమయంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. నేడు రైతుల గురించి మాట్లాడుతున్నారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పెరుగుతున్న గంజాయి పంటలపై నాటి టీడీపీ మంత్రులే గోల గోల చేస్తే… ఇప్పుడు ఏపీలో గంజాయి పెరిగిపోయిందని అంటున్నారు బాబు. ఆఖరికి దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడానికి కారణం కూడా వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు.

సరిగ్గా ఇదే విషయాలపై మంత్రి రోజా ఫైరయ్యారు. ప్రస్తుతం కృష్ణాజిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా గుడివాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా.. విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై రోజా తీవ్రంగా స్పందించారు. అదంతా అల్జీమర్స్ ఎఫెక్ట్ అని అన్నారు.

ఆల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా తయారైన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రులే గంజాయి సాగుపై బహిరంగంగా మాట్లాడారని, నాటి విషయాలను మరిచిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మంత్రి రోజా విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగుని గరిష్టంగా నిరోధించగలిగామని తెలిపారు. ఇదే సమయంలో సెబ్ వ్యవస్థను తీసుకువచ్చి రాష్ట్రంలో గంజాయి పై ఉక్కుపాదం మోపామని మంత్రి రోజా చెప్పారు. ఇదే సమయంలో నేడు రైతులపై ఎక్కడలేని ప్రేమ నటిస్తున్నాడని చంద్రబాబుపై రోజా ఫైరవుతూ… గతాన్ని గుర్తు చేసేప్రయత్నం చేశారు.

వ్యవసాయం దండగ అని రైతుల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు.. విద్యుత్ సమస్యలపై ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబు… నేడు రైతులపై ప్రేమ నటిస్తున్నాడని.. ఇదంతా ఎన్నికల డ్రామా అని.. ఆ విషయం ప్రజలకు తెలిసిందని.. అందుకే 2019 ఎన్నికల్లో వాయించి వదిలారన్న స్థాయిలో రోజా ఫైరయ్యారు.

ఇదే సమయంలో కుంభకోణాల కర్ణుడు చంద్రబాబు చెప్పే మాయ మాటలను నమ్మే పరిస్థితిలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ లేరని మంత్రి రోజా స్పష్టం చేశారు.