వైసీపీలో రోజా ఒంటరి… జగన్ వద్ద ఆన్సర్ ఉందా?

ఆర్కే రోజా.. అటు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి! అనంతరం.. రాజకీయాల్లోకి వచ్చిన రోజా తెలుగుదేశంలో అరంగేట్రం చేశారు. ఆ సమయంలో వరుసగా రెండు సార్లు 2004, 2009లలో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరిన రోజా 2014, 2019లలో వరుసగా గెలిచారు. ఈ క్రమంలో ప్రస్తుతం జగన్ కేబినెట్ లో టూరిజం మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇదే సమయంలో అసెంబ్లీలోనూ, బయటా.. పార్టీకి, పార్టీ అధినేతకూ రోజా వెన్నుధన్నుగా నిలుస్తుంటారు. జగన్ పై ఎవరైనా చిన్న విమర్శ చేస్తే నిప్పులు కక్కుతుంటారు. ఇక బహిరంగ సభల్లో జగన్ పై తనకున్న ప్రేమాభిమానలను తనదైన రీతిలో ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. జగన్ విషయంలో ఏమాత్రం కల్మషం లేని నేతగా ఆమెకు వైసీపీ శ్రేణుల్లో పేరుంది.

పార్టీకోసం, ప్రభుత్వం కోసం, జగన్ కోసం.. ప్రత్యర్థులపై విరుచుకుపడటానికి కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, అమర్ నాథ్, జోగి రమేష్ మొదలైన నేతలున్నప్పటికీ… మహిళల్లో మాత్రం రోజా ఒక్కరే ఆ బాధ్యత తీసుకుని నికార్సుగా ముందుకుపోతున్నారని అంటారు. అలాంటి రోజాకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. తీవ్ర అవమానం జరిగింది.

అవును… టీడీపీ నేత, ఆరున్నర పదుల వయసున్న ఒక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ… రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంతో అసభ్యకరమైన విమర్శలు చేశారు. ఇప్పటివరకూ ఏనాడూ ఒక మహిళా మంత్రిపై చేయకూడని వ్యాఖ్యలు చేశారు. రాయడానికి అవకాశం లేని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా అనే సంస్కారం మరిచారు!

ఈ సమయంలో రోజా ఓంటరైపోయారు! ఆమెకు ధన్నుగా ఒక్క వైసీపీ నేత కూడా మీడియా ముందుకు రాలేదు! దర్శకుడు రాం గోపాల్ వర్మ డిమాండ్ చేయడం వల్లో ఏమో కానీ… ఏపీ మహిళా కమిషన్ మాత్రం స్పందించింది! ఏపీ డీజీపీకి వాసిరెడ్డి పద్మ ఒక లేఖ మాత్రం రాశారు. పవన్ కల్యాణ్ మహిళా వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇలాంటి ఒక లేఖ రాశారు! తర్వాత ఏమైందో ఆమెకే తెలియాలి!

ఈ సమయంలో మంత్రిగా పనిచేస్తున్న ఒక సీనియర్ పొలిటీషియన్ అనరాని మాటలు అంటూ సమాజంలో ఆమె పరువు తీశారు రాజకీయ ప్రత్యర్థులు! మరి తన మంత్రి మీద, ఒక మహిళ మీద ఇలాంటి దాడి జరుగుతున్నపుడు ప్రభుత్వం కానీ పార్టీ కానీ స్పందించకపోతే రేపటి రోజున ఏపీ మహిళల ఉద్ధరణకు, భద్రతకు కట్టుబడి ఉంటామని చెప్పే మాటలకు విలువ ఏమి ఉంటుంది అనేది ఇప్పుడు జగన్ సర్కార్ కి ఎదురవుతున్న కీలమైన ప్రశ్న!

మరి ఈ ప్రశ్నకు జగన్ సర్కార్ ఏమి చెబుతుంది.. ఎలా రియాక్ట్ అవుతుంది.. నిన్న శనివారం, ఇవాళ ఆదివారం కాబట్టి వీకెండ్ అయిన తర్వాత అలోచిద్దామని అనుకుంటుందా.. లేక, లైట్ తీసుకుంటుందా.. లైట్ తీసుకుని సమాజానికి ఏమి సందేశం ఇద్దామనుకుంటుంది అనేది వేచి చూడాలి.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కు వైసీపీ ఎంపీలు మద్దతు కూడా పలికారు. అందుకు అసెంబ్లీలో రోజా.. జగన్ ని “అన్నా” అని సంబోధిస్తూ రాష్ట్రంలోని మహిళలందరి తరుపునా ధన్యవాదాలు తెలిపారు. మరో విషయం… ఏపీలో హోమంత్రి ఎవరో తెలుసా? ఒక మహిళే!