ఆ రెండు బిల్లులు ఆమోదం పొందినట్టేనా?

AP government to sale Amaravathi buildings

ఏపీకి మూడు రాజధానుల అంశంపై జగన్ సర్కార్ తీసుకొచ్చిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఎన్నో రోజులుగా సందిగ్ధత నెలకొంది. అయితే అప్పట్లో ఈ రెండు బిల్లులు శాసన సభలో ఆమోదం పొందిన మండలిలో మాత్రం తిరస్కరించబడ్డాయి. అయితే ఆ రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమీటీకి పంపుతామని చెప్పినా ఆ దిశగా అడుగులు పడలేదు.

అయితే టీడీపీ నేతలు కావాలనే ఈ బిల్లులను అడ్డుకుంటున్నారని, మండలిలో ఈ బిల్లులను ప్రవేశపెట్టి 14 రోజులు ముగిస్తే బిల్లులు ఆమోదం పొందినట్టే అని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఈ రెండు బిల్లులను త్వరలోనే గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాలన వికేంద్రీకరణ, CRDA బిల్లులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరగా ఆయన ఆమోదిస్తారా లేదా న్యాయ సలహా కోరతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది.

ఈ బిల్లులకు సంబంధించి ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తుండగా, వాటిపై స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే నిబంధనల ప్రకారమే అసెంబ్లీ అధికారులు గవర్నర్‌కు పంపారని, మండలిలో బిల్లులు ప్రవేశపెట్టిన తరువాత వాటంతటవే ఆమోదం పొందినట్టు కదా అని ప్రశ్నించారు.