దూకుడు పెంచిన అమర్నాథ్… తెరపైకి కీలక ప్రశ్నలు!

వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికర్లు అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల దుమారం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీలోని వాలంటీర్లు, వారి సహాయం పొందుతున్న సమాన్యులు, వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ ని ఏకి పారేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ జగన్ విశ్వరూపం చూపించారు. తిరిగి కౌంటర్ ఇవ్వలేని స్థాయిలో వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నవారికి గట్టిగా ఇచ్చి పడేశారు. దీంతో… తేలుకుట్టిన దొంగల్లా వారు ఉండిపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో తాజాగా పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. తనదైన ప్రత్యేక జ్ఞానంతో పలు ప్రశ్నలు సంధించారు. దీన్ని ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకున్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

అయితే ఈ విషయాలపై తాజాగా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కల్యాణ్‌ ను సంబోధిస్తూ… చెప్పాలనుకున్న విషయం సూటిగా చెబుతూ.. కొన్ని చోట్ల సెటైర్లు వేస్తూ.. మరికొన్ని చోట్ల ఎద్దేవా చేస్తూ.. ఇంకొన్ని చోట్ల పలు ప్రశ్నలు సంధించారు.

అవును… వాలంటీర్లపై పలువురు నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. వాలంటీర్లు గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా ప్రజలకు పింఛ‌న్, వారికి అవ‌స‌ర‌మైన ప్రభుత్వ స‌ర్టిఫికెట్లు, ఇతర సంక్షేమ పథకాల లబ్దిని అందజేస్తోన్నారని గుర్తు చేశారు. ఈ విషయం కళ్లుండీ చూడలేని వారికి కనపడటం లేదేమో అని సెటైర్స్ వేశారు.

ఇదే సమయంలో వాలంటీర్లు.. క‌రోనా వైరస్ వ్యాప్తి చెందిన సమ‌యంలో ప్రాణాల‌కు తెగించి విధులను నిర్వహించారని, వ్యాక్సినేష‌న్‌ పై ప్రజ‌ల‌కు ఎప్పటిక‌ప్పుడు సమాచారం అందించారని మంత్రి పేర్కొన్నారు. ఆ కష్టకాలంలో నువ్వు, నీ గురువు చంద్రబాబు హైదరాబాద్‌ లో ముసుగుత‌న్ని ప‌డుకున్నారని పవన్ ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు.

అనంతరం ఎవరి ఆదేశాల మేరకు ఏపీలో వాలంటీర్లు ప్రజ‌ల‌కు మంచి చేస్తున్నారనే విషయం కరోనా సమయంలో గుర్తుకు రాలేదా? అని నిలదీసిన ఆయన… వారు ఏ మంత్రిత్వ శాఖ కింద‌కు వస్తారో కూడా తెలియకుండానే రాజకీయాలు చేస్తున్నావా? ముఖ్యమంత్రి అవుతానంటూ మాట్లాడుతున్నావా? అంటూ చురకలు అంటించారు.