మంత్రి ఇలాకాలో ఎన్నికల తాయిలాలు

ఎన్నికల సమయంలో తాయిలాల పంపిణీకి అవకాశం దొరుకుతుందో లేదో అన్న ఉద్దేశ్యంతో తెలుగుదేశంపార్టీ నేతలు మాత్రం తాయిలాల పంపిణీకి ఇపుడే తెరలేపారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం వ్యాప్తంగా ఇపుడే చీరలు, గొడుగుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మంత్రి తరపున భార్య, కొడుకు రంగంలోకి దిగి నియోజకవర్గంలోని మహిళలకు, వృద్ధులకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. మంత్రి తరపున పంపిణీ జరుగుతున్న తాయిలాల విలువ సుమారు రూ 2 కోట్ల వరకూ ఉంటుందట. ఎన్నికలకు ముందు పంచుతున్న తాయిలాలకే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే ఇక ఎన్నికల సమయంలో ఎంత ఖర్చు పెడతారు ?

విచిత్రమేమిటంటే, రాష్ట్రస్ధాయిలో చంద్రబాబునాయుడు తాయిలాలను పంపిణీ చేస్తుంటే నియోజకవర్గాల స్ధాయిలో మంత్రులు, ఎంఎల్ఏలు అప్పుడే రంగంలోకి దిగేసి తాయిలాలను పంపిణీ చేసేస్తుండటం గమనార్హం. అయితే చంద్రబాబు ఇతరులకు ఓ తేడా ఉండి లేండి. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తానని ఇది చేస్తానని హామీ ఇస్తున్నారు చంద్రబాబు. అయ్యన్నపాత్రుడు లాంటి వాళ్ళకు అలాంటి హామీలపై పెద్దగా నమ్మకం ఉన్నట్లు లేదు. అందుకనే ఏకంగా తాయిలలు పంపిణి మొదలుపెట్టేశారు.

పంపిణీ చేస్తున్న తాయిలాలపై మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన తాయిలాలకు ఇపుడు తాము పంపిణీ చేస్తున్నది బోనస్ గా చెప్పుకుంటున్నారు. అసలు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చింతకాయల్లో అయోమయం కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది లేదని గతంలో ఓసారి చింతకాయలే స్వయంగా ప్రకటించారు. తనకు బదులు తన కొడుకు విజయ్ పోటీ చేస్తాడని కూడా చెప్పారు. అయితే తర్వాత సీన్ రివర్స్ అయ్యింది లేండి. ఎలాగంటే విజయ్ పోటీ చేస్తాడని మంత్రి అలా ప్రకటించారో లేదో తమ్ముడు సన్యాసిపాత్రుడు రంగంలోకి దిగేశారు. మంత్రి తర్వాత పోటీలో ఉండబోయేది తానే అంటూ టిక్కెట్టు కోసం పట్టుబడుతుండటంతో చింతకాయలకు తలనొప్పులు మొదలయ్యాయి. మొత్తానికి ఎవరు పోటీ చేస్తారో తెలీదు కానీ తాయిలాల పంపిణీ మాత్రం జరిగిపోతోంది.