ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ కోసం మంత్రి ధర్మాన రాజీనామా.?

మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా వున్నానని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే వెంటనే రాజీనామా చేసి, ఉద్యమంలోకి వెళ్ళాలని వుందంటూ ధర్మాన ప్రకటించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

అంతే కాదు, అమరావతి పేరుతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినదిస్తున్నవారిపై రాజకీయంగా దాడులు చేయాలని కూడా ధర్మాన పిలుపునివ్వడం వివాదాస్పదమవుతోంది. అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో గతంలో తిరుపతికి పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు అరసవెల్లికి పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

ఆ పాదయాత్ర విశాఖ మీదుగా అరసవెల్లి చేరుకోవాల్సి వుంది. అయితే మార్గమధ్యంలోనే అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. నిజానికి, పాదయాత్రని ఎవరూ పట్టించుకోవడంలేదు. వైసీపీ కూడా లైట్ తీసుకుంటే అసలు సమస్యే వుండదు.

అమరావతి రైతుల గురించి ఏదన్నా వార్త వస్తోందంటే, అది అధికార పక్షం నుంచే అవుతోంది. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చే వార్తల్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. కానీ, మంత్రులు కాస్త అమరావతి రైతుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో.. న్యూస్ ఛానళ్ళలో ఆయా అంశాలపై డిబేట్లు జరుగుతున్నాయ్.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ప్రజా ప్రతినిథులెవరూ రాజీనామా చేయడంలేదు.. ప్రత్యేక హోదా కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమో కూడా రాజీనామాలు చేయట్లేదు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించీ రాజీనామా డిమాండ్లు తెరపైకి తీసుకురావడంలేదు. వస్తుందో లేదో తెలియని రాజధాని విషయమై ఈ రాజీనామా పేరుతో డ్రామాలు అవసరమా.?