చంద్రబాబు పరువు తీసేసిన మంత్రులు

ఆంధ్రాలో మంత్రులు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబునాయుడు పరువును తీసేస్తున్నాయి. జగన్ ను ఆంధ్రా ద్రోహిగా చిత్రీకరిస్తున్న మంత్రులు, ఎంపిలు చంద్రబాబును కూడా ద్రోహిగా చిత్రీకరిస్తున్న విషయాన్ని మరచిపోయారు. ఆంధ్రా ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్న కెసియార్ తో జగన్ పొత్తు పెట్టుకున్నందుకు టిడిపి దృష్టిలో జగన్ ద్రోహి అయిపోయారు. నిజమే ఆంధ్రా ప్రయోజనాలను వ్యతిరేకించి ఎవరు పొత్తు పెట్టుకున్నా వాళ్ళంతా రాష్ట్ర ద్రోహుల క్రిందే లెక్క. మరి చంద్రబాబు సంగతేంటి ? తాను కెసియార్ తో పొత్తుకు ప్రయత్నిస్తే కెసియార్ తనను చీ కొట్టాడని స్వయంగా చంద్రబాబే చెప్పారు కదా ? మంత్రుల లెక్కల ప్రకారం చంద్రబాబు కూడా ఏపి ద్రోహే కదా ? పొత్తు విషయంలో కెసియార్ చీ కొడితేనే కదా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది ?

ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలంటూ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించటానికి కెటియార్ అండ్ కో జరిపిన భేటీపై తెలుగుదేశంపార్టీ నేతలు భయకరంగా రెచ్చిపోతున్నారు. వారిద్దరి భేటీపై మంత్రులు, ఎంపిలు అంతలా రెచ్చిపోవటానికి కారణాలైతే ఎవరికీ అర్ధం కావటం లేదు. వారి భేటీపై మొదటగా చంద్రబాబునాయుడు రెచ్చిపోయారు. తర్వాత మంత్రులు, ఎంపిలు అందుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని ముందు ఫోన్లో మాట్లాడి తర్వాత కొడుకు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ అండ్ కోను చర్చల కోసం జగన్ దగ్గరకు పంపారు కెసియార్. అప్పటి నుండి మొదలైంది టిడిపి రచ్చ.

చంద్రబాబు కానీ మంత్రులు, ఎంపిలు చెబుతున్నదాని ప్రకారమైతే జగన్ , కెసియార్ పొత్తు ఖాయమైపోయినట్లే. ఏపి ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా కెసియార్ సాయం చేస్తారట. ఇద్దరి మధ్య పొత్తు కుదిరింది కాబట్టి జగన్ ఆంధ్రా ద్రోహే అని టిడిపి ముద్ర వేసేసింది. ఫెడరల్ ఫ్రంట్ లో చేరమని టిఆర్ఎస్ ఆహ్వానించినట్లు జగన్ కూడా చెప్పారు. అయితే, పార్టీలో చర్చించిన తర్వాత చెబుతామని తాను బదులిచ్చినట్లు జగన్ చెప్పిన విషయాన్ని టిడిపి, చంద్రబాబు మీడియా ఉద్దేశ్యపూర్వకంగా మరుగున పరుస్తోంది.

పొత్తుల విషయంలో తనను చీ కొట్టిన కెసియార్ వైసిపితో పొత్తు పెట్టుకోవటంపై ఆశక్తి చూపటాన్ని చంద్రబాబు అండ్ జీర్ణించుకోలేకపోతున్న విషయం అర్ధమైపోతోంది. తనను చీ కొట్టి కెసియార్ తన కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ ను జగన్ ఇంటికి పంపటం కూడా చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఆ విషయమే చంద్రబాబు, మంత్రుల మాటల్లో స్పష్టంగా బయటపడిపోతోంది. తమ ఉక్రోషాన్ని దాచిపెట్టి జగన్ ను ఏపి ద్రోహిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు మీడియాతో కలిసి టిడిపి నానా అవస్తలు పడుతోంది.