ఎన్నికల కమీషన్ కు సోమిరెడ్డి సవాల్

ఎన్నికల కమీషన్ కు అధికార తెలుగుదేశంపార్టీకి మధ్య అగాధం పెరిగిపోతోంది. వీరిద్దరి మధ్య ప్రభుత్వ యంత్రాంగం నలిగిపోతోంది. సమీక్షలకు హాజరు కావాల్సిందే అంటూ చంద్రబాబునాయుడు, మంత్రులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. సమీక్షలకు హాజరు అయితే చర్యలు తప్పవంటూ ఎన్నికల కమీషన్ కన్నెర్ర చేస్తోంది. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక మధ్యలో అధికార యంత్రాంగం బలైపోతోంది.

నిజానికి ఎన్నికలైపోయింది కాబట్టి సిఎం అయినా మంత్రులైన రోజువారి పాలనా సమీక్షలను చేయటంలో తప్పేమీలేదు. కోడ్ అమల్లో ఉన్నపుడు విధానపరమైన నిర్ణయాలు, కొత్త పథకాలు, కేటాయింపులు లాంటివి ప్రకటించకూడదు. కానీ వ్యవస్ధలన్నింటికీ తాను అతీతుడనని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకనే కోడ్ అమల్లో ఉన్నపుడు ఏకంగా 18 జీవోలను జారీ చేశారు. ఆ 18 జీవోల్లో ఎక్కువ భాగం భూ కేటాయింపులకు సంబంధించినవే ఉన్నాయట.  సరే వాటిపై సమీక్ష చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణం వాటన్నింటిని నిలిపేశారు.

తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు సవాలు విసిరారు. మరో ఐదు రోజుల్లో తన ఉన్నతాధికారులతో శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తానని దమ్ముంటే అడ్డుకోవాలని ఈసీకి సవాలు విసిరారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణం చూపి తమ రోజువారీ సమీక్షలను కూడా చేయకూడదంటే ఎలాగంటూ మండిపడ్డారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పుకానీ రోజువారీ సమీక్షలు కూడా చేయొద్దంటే ఎలాగంటూ మండిపోయారు. మరి చంద్రబాబు జారీ చేసిన 18 జీవోల సంగతిని మాత్రం మంత్రి ప్రస్తావించలేదు.

పైగా తన సమీక్షలను ఎన్నికల కమీషన్ అడ్డుకుంటే సుప్రింకోర్టుకెళతానంటూ బెదిరింపులొకటి. మొన్న జరిగిన వడగళ్ళ బీభత్సానికి పంటలు దెబ్బతిన్నాయి. నష్టం ఏ మేరకు జరిగిందనే విషయంలో సమీక్ష చేయాలి కదా అంటున్నారు. నిజమే వాటిని ఉన్నతాధికారులు కూడా సమీక్ష చేయొచ్చు. చీఫ్ సెక్రటరీ కూడా చేయొచ్చు. కానీ తామే సమీక్షించాలని మంత్రి పట్టుబడుతున్నారు. పైగా వ్యవసాయ సీజన్ మొదలవుతున్న నేపధ్యంలో సమస్యలపై సమీక్షలు చేయవద్దని చెప్పటం అన్యాయమనే మంత్రి అంటున్నారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక మధ్యలో ఉన్నతాధికారులు నలిగిపోతున్నారు.