మంత్రి బుగ్గన జ్ఞాన గుళికలు.! ట్రోలింగ్ బీభత్సం.!

రాష్ట్రాలైనా, కేంద్రమైనా అప్పులు చేయాల్సిందేనంటున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని ఆయన సెలవిస్తున్నారు. అప్పులు చేయడం కొత్తేమీ కాదనీ, చంద్రబాబు హయాంలోనూ, అంతకు ముందూ అప్పులు జరిగాయన్నది బుగ్గన ఉవాచ.

నిజమే, అప్పులు తప్పు కాదు.. ఈ రోజుల్లో. సంక్షేమం పేరుతో ప్రజల్ని ప్రభుత్వాలు నిండా ముంచేస్తున్న రోజులివి. సంక్షేమ పథకాలతో రాజకీయ పార్టీలు నిస్సిగ్గుగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాలమిది. చంద్రబాబు హయాంలో జరిగిందదే, వైసీపీ హయాంలోనూ జరుగుతున్నది అదే.

‘చంద్రబాబు ఏం చేశారో, మేమూ అదే చేస్తున్నాం. చంద్రబాబు ఎలాగైతే రాజకీయంగా దిశాలా తీశారో.. అదే పరిస్థితి మాకూ రాబోతోంది..’ అని బుగ్గన చెప్పబోతున్నారా.? లేకపోతే, అప్పులు ‘మామూలే’ అంటారేంటి.? పైగా, పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే బెటర్.. అని బుగ్గన ఎలా చెప్పగలుగుతున్నారో ఏమో.!

తెలంగాణకి ప్రధాన ఆదాయ వనరు అభివృద్ధి చెందిన రాజధాని హైద్రాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాంటిదేమీ లేదు. తెలంగాణకు ఆదాయం వస్తుంది గనుక, అప్పులు పెరిగినా తట్టుకోగలదు. కేంద్రం సహకరించనిదే ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకు పడని పరిస్థితి.

చంద్రబాబు హయాంలో అప్పులు జరిగినప్పుడు.. ఆ అప్పుల్ని తీవ్రంగా విమర్శించిన ఘన చరిత్ర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వుంది. ‘అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తారా.?’ అని బుగ్గన అప్పట్లో విమర్శించారు. ఇప్పుడేమో, తాము చేస్తున్న అప్పులతో రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తున్నట్లు చెబుతున్నారు బుగ్గన.