ఆర్థిక మంత్రి బుగ్గనకీ తప్పని ‘గడప గడపకీ’ చేదు అనుభవం.!

లక్ష రూపాయల వరకూ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరింది కదమ్మా.. అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో లబ్దిదారు అయిన ఓ మహిళతో అన్నారు. కానీ, ఆ మహిళ ఆర్థిక మంత్రికే లెక్కలు చెప్పింది. ‘లక్ష ఇస్తున్నారు సరే, రెండు లక్షలు లాగేస్తున్నారు కదా.? అయినా, మీరు ఇస్తున్నవి మా డబ్బులే కదా, మీ పేరుతో ప్రచారం చేసుకోవడమేంటి..’ అంటూ సదరు మహిళ నిలదీసింది.

కటకటా.! ఎంత కష్టమైన పరిస్థితి ఇది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు. చంద్రబాబు హయాంలో అప్పులు జరిగితే రాష్ట్రం మునిగిపోయినట్టు.. వైసీపీ హయాంలో అప్పులు జరిగితే అది రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లు.. అని సూత్రీకరించిన లెక్కల మాస్టారు బుగ్గన రాజేంద్రనాథ్.

అలాంటి బుగ్గన రాజేంద్రనాథ్‌కే ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఓ సాధారణ మహిళ లెక్కలతో చుక్కలు చూపించిందంటే, సాధారణ ఎమ్మెల్యేల పరిస్థితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ ప్రభుత్వం గడచిన మూడేళ్ళలో అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేసింది. సంక్షేమం విషయమై వైసీపీ సర్కారుని తప్పు పట్టలేం. కానీ, అభివృద్ధి ఏది.? అభివృద్ధి లేక.. జనానికి ఉపాధి దొరక్క.. ఇంకోపక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి.. జనం నానా తిప్పలూ పడుతున్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపు, ఆర్టీసీ ఛార్జీల పెంపు.. వీటికి తోడు, చెత్త పన్ను సహా రకరకాల పన్నులు.. వెరసి సామాన్యుడి బతుకు చితికిపోతోంది. ఆ విషయాన్నే ఓ సాధారణ మహిళ, ఆర్థిక మంత్రిని ఏకరువు పెట్టేసింది. పైగా, మీ పేరుతో ప్రచారం చేసుకుంటున్న పథకాలకు, మా ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్ముల్ని వెచ్చించి, వాటిని మాకేదో బిచ్చమేస్తున్నట్లు మాట్లాడతారేంటి.? అని మహిళ నిలదీయడమంటే చిన్న విషయం కాదు మరి.!