చట్టాలకు ప్రజాభిప్రాయంతో సంబంధం లేదా.?

చట్టాలూ.. ప్రజలూ.. ప్రజా ప్రతినిథులు.. ప్రజాభిప్రాయాలు.. ఈ మొత్తం వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఇవి కొంతమేర అభ్యంతరకరమైన వ్యాఖ్యలన్న చర్చ కూడా జరుగుతోంది.

చట్టాలన్నీ ప్రజాభిప్రాయం మేరకు రూపొందించడం జరగదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యానారాయణ. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు వైసీపీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో తరగతుల విభజనను చేపట్టింది. తరగతుల వారీగా స్కూళ్ళలో మార్పులు చేస్తున్నారు.

అయితే, ఈ వ్యవహారంపై కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఎయిడెడ్ స్కూళ్ళ వ్యవహారమూ పెను దుమారం రేపుతోంది. ప్రజల తరఫున ఉపాధ్యాయ సంఘాలు నిలబడుతున్నాయి. దాంతో, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది.

ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసమే కొన్ని కీలక నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకుంటాయనీ, అప్పటికప్పుడు ఆ నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనా, దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు వుంటాయనీ బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఇందులో నిజం లేకపోలేదు కూడా.

అయితే, చట్టాల రూపకల్పన, ప్రభుత్వాల నిర్ణయాలు.. ఇలాంటి విషయాల్లో ప్రజాభిప్రాయం.. అనేది అత్యంత కీలకమని, ప్రతిపక్షంగా వున్నప్పుడు వైసీపీనే నినదించింది. అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ వైసీపీ వ్యతిరేకించింది. ‘ప్రజా వ్యతిరేక పాలన..’ అంటూ మండిపడింది. ఇప్పుడు అదే పని విపక్షాలు చేస్తున్నాయి.

విపక్షాల అభ్యంతరాల్ని పక్కన పెడితే, ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నా, ప్రజాభిప్రాయంతో పనిలేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం సబబు కాదు. రైతుల ఉద్యమాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, కొత్త సాగు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. ఆ చట్టాల్ని తొలుత సమర్థించి, ఆ తర్వాత వైసీపీ వ్యతిరేకించింది కూడా.!