సాగర తీరానా సర్వాంగ సుందర నగరంగా పేరుపొందిన విశాఖను ఈ మధ్య వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలు మరువకముందే ఇటీవల రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఓ పక్క ఈ వరుస ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపిస్తుంటే, అధికార పార్టీ వైసీపీ మాత్రం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినందుకే ప్రజలలో విశాఖపై అభద్రత భావాన్ని కల్పించేందుకు ఇలాంటి వరుస ప్రమాదాలను టీడీపీనే చేయిస్తుందని వైసీపీ నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నేడు మీడియాతో మాట్లాడిన మంత్రి అవంత్గి శ్రీనివాస్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకసారి పరిశ్రమకు లైసెన్స్ తీసుకున్న తర్వాత కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎప్పటికప్పుడు పరిశ్రమలలో తనిఖీలు చేయమని అధికారులను ఆదేశించామన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కూడా ప్రమాదాలు జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు ఆయన తెలిపారు.