ఆంద్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని అసలు పట్టించుకోలేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. అంతేకాకుడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం 20శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదని ఎద్దేవా చేసిన అనిల్, దివంగత నాయకుడు వైఎస్ రాజేశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా ప్రాజెక్టులను పూర్తి చేశారని చెప్పారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కూడా చంద్రబాబు నిజాలు రాయలేదంటూ మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని, ఎన్నికల టైమ్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు మంత్రి అనిల్. 2014లో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రివైజ్డ్ ఎస్టిమేట్లు సబ్‌మిట్ చేయకుండా కాలయాపన చేశారని, పోలవరం నిర్మాణంలో భాగంగా నాడు కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ కాంపౌండ్ నిధులు ఇస్తామన్నా బాబు అంగీకరించలేదన్నారు.
అసలు కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవర ప్రాజెక్టును, ప్యాకేజీల కోసం రాష్ట్రమే నిర్మిస్తుందని చెప్పిన చంద్రబాబు అదిగో చివరి దశకు వచ్చింది, ఇదిగో అయిపోతుందంటూ డ్రామాలు ఆడి చివరకు చేతులెత్తేశారని అనిల్ మండి పడ్డారు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం పనులు బ్రేక్ లేకుండా సాగుతున్నాయని, కరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదని, 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని సంచలన ప్రకటన చేశారు మంత్రి అనిల్.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అసలు ఎంత ఖర్చు అవుతుందో కనీస అంచనా కూడా లేకుండా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, నాడు పోలవరం అంచనా వ్యయంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో సీయం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని తెలిపారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారంటూ ఎల్లో దుష్ప్రచారం మొదలు పెట్టారని, ఈ క్రమంలో పోలవరం ఎత్తు ఒక్క మిల్లీ మీటర్ కూడా తగ్గించే ప్రసక్తే లేదని అనిల్ తేల్చి చెప్పారు. స్పష్టం చేశారు.