తెలుగుదేశం వారికి రోడ్లెలా వేస్తాం.. మంత్రి అంబటి అలా అన్నారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా వాళ్లకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈరోజు రాజుపాలెంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించగా ప్రజలు అంబటి రాంబాబుకు తమ సమస్యలు చెప్పుకున్నారు. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా తనకు పింఛన్ రావడం లేదని దివ్యాంగురాలు తన బాధను చెప్పుకున్నారు.

ఎక్కువ సంఖ్యలో విద్యుత్ మీటర్లు వాళ్ల ఇంటికి ఉండటంతో పింఛన్ రాలేదని అధికారులు చెప్పగా మంత్రి సైలెంట్ గా వెళ్లిపోయారు. మంత్రి సమస్యను పరిష్కరించకుండా సైలెంట్ గా వెళ్లిపోవడంతో సదరు మహిళ అంబటి రాంబాబు ప్రవర్తనపై మండిపడ్డారు. ఆ తర్వాత బుల్లబ్బాయి అనే వ్యక్తి అంబటి రాంబాబుతో వైసీపీ పాలన బాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏమీ చేయడం లేదని బుల్లబ్బాయి కామెంట్లు చేశారు.

ఆ తర్వాత మరో వ్యక్తి అంబటి రాంబాబును రోడ్ల గురించి ప్రశ్నించారు. అయితే అంబటి రాంబాబు మాత్రం ఆ వ్యక్తికి రోడ్ల గురించి జవాబివ్వకుండా వైసీపీ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మంత్రితో పాటు ఉన్న వ్యక్తులు రోడ్ల గురించి ప్రశ్నించిన వ్యక్తి టీడీపీకి చెందిన వ్యక్తి అని చెప్పగా మంత్రి ఆ వ్యక్తిని మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారా అని ప్రశ్నించారు.

ఆ తర్వాత మంత్రి అంబటి రాంబాబు టీడీపీ వాళ్లకు రోడ్లు ఎలా వేయిస్తాం అని అన్నారని తెలుస్తోంది. అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడటం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం రోడ్ల విషయంలో శ్రద్ధ పెట్టడం లేదు. జగన్ సర్కార్ రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుంది.