వైసీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేతపై ఎయిర్పోర్టులో జరిగిన దాడి ఘటనతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. నేతలంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనపై రకరకాల వార్తలు, వాదనలు వినిపిస్తున్నాయి. దాడి చేసిన వ్యక్తి మీవాడంటే, మీవాడంటూ అధికార ప్రతిపక్షాలు వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పై దాడిని తట్టుకోలేక వైసీపీ నేత ఒకరు గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.
గురువారం విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో జగన్ భుజానికి గాయమయ్యింది. జగన్ వీఐపీ లాంజ్ లో వెయిట్ చేస్తుండగా నిందితుడు శ్రీనివాస్ నవ్వుతూ జగన్ ని పలకరించాడు. జగన్ తో పాటు అక్కడ ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు కాఫీ, టీలు అందించాడు. ఈసారి 160 సీట్లు వస్తాయా అన్నా? అని జగన్ ని ఆరా తీసాడు. సెల్ఫీ దిగుతా అని జగన్ పక్కన నిలబడి కోడి కత్తితో ఒక్కసారిగా జగన్ పై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ జగన్ ని రక్షించారు.
దాడి సమయంలో జగన్ పక్కనే వైసీపీ నేత మధుసూదన్ కత్తి దాడిని పసిగట్టారు. వెంటనే జగన్ ని పక్కకి తోయడంతో ప్రాణాపాయం జరగకుండా కత్తి పోటు జగన్ భుజానికి తాకింది. ఆయన పక్కకి తోయకుంటే ఆ కత్తి జగన్ మెడకు గుచ్చుకుని జగన్ మాకు దూరమయ్యేవారంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో జగన్ అభిమానులంతా బియ్యపు మధుసూదన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. “నువ్వు కాపాడింది ఒక్క జగన్ అన్ననే కాదన్నా… ఆయనపై ఆధారపడిన కొన్ని కోట్లమంది ప్రాణాల్ని కాపాడావు మధుసూదన్ అన్నా” అంటూ ఆయన్ని అభినందిస్తున్నారు.
ఇదిలా ఉండగా దాడి జరిగిన సమయంలో వైజాగ్ సిటీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డా.మల్లా విజయప్రసాద్ కూడా జగన్ పక్కనే ఉన్నారు. దాడి జరిగిన సమయంలో నిందితుడు శ్రీనివాస్ ని ధైర్యంగా పక్కకు తోసెయ్యడంలో విజయప్రసాద్ కూడా సహకరించారని తెలుస్తోంది. అయితే ఈ ఘటన తర్వాత విజయ ప్రసాద్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నిన్న అంతా మీడియాలో ప్రసారమైన కథనాలతో మరింత కలత చెందిన విజయప్రసాద్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఆయన మైల్డ్ హార్ట్ ఎటాక్ కి గురయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తరలించడంతో వైద్యుల వైద్య సహాయంతో కోలుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని వైసీపీ అభిమానులు ఆశిస్తున్నారు.