జనసేనానికి మద్దతుగా రంగంలోకి దిగనున్న మెగాస్టార్ చిరంజీవి.

2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతుగా మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగబోతున్నారా.? ‘ఏమో, భవిష్యత్తులో జనసేన పార్టీకి మద్దతిస్తానేమో. నా తమ్ముడికి నా నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుంది..’ అని ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్ల సమయంలో చిరంజీవి అసలు విషయం చెప్పేశారు కూడా. తాను నేరుగా రంగంలోకి దించడం కంటే, సినీ పరిశ్రమ నుంచి కొంతమందిని జనసేన తరఫున ప్రచారం కోసం రంగంలోకి దించాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో, జనసేన తరఫున పోటీ చేయాలనుకుంటోన్న సినీ ప్రముఖుల వివరాల్నీ చిరంజీవి తెలుసుకుంటున్నారట, వారితో చర్చిస్తున్నారట.

చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా 2009 ఎన్నికల్ని చూశారు. ఎన్నికలంటే ఆ లెక్కలు, అవసరాలు వేరే వుంటాయ్. అవన్నీ చిరంజీవికి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్‌కి కూడా అవి తెలుసుగానీ, ఆయన ఆలోచనలు వేరు. ఆ ఆలోచనల వల్లనే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. కరెన్సీ లేకుండా రాజకీయం చేస్తే ఎలా వుంటుందో జనసేన పార్టీకి 2019 ఎన్నికలతో బాగా తెలిసొచ్చినా, 2024 ఎన్నికలకీ అదే పద్ధతిలో వెళ్ళాలని జనసేనాని అనుకుంటున్నారు. ‘అది కరెక్ట్ కాదు.. రాజకీయాల్లో అన్నీ చేయాల్సిందే..’ అని చిరంజీవి, తన తమ్ముడికి చెబుతున్నారంటూ ఓ ప్రచారం తెరపైకొచ్చింది.

‘జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలంటే.. మేం కూడా ఫక్తు రాజకీయాలు చేయాల్సిందే.. ఖర్చు మేమే పెట్టుకుంటాం.. అందుకు జనసేనాని ఒప్పుకుంటే మేం రంగంలోకి దిగుతాం..’ అంటూ కొందరు సినీ ప్రముఖులు చిరంజీవికి కూడా చెప్పారట. కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవిని కలిశారు. విశాఖలో జనసేనానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, ‘ఇద్దరూ కలిసి రాజకీయం చేస్తే బావుంటుంది..’ అని మోడీ, జనసేనాని పవన్ కళ్యాణ్ వద్ద చిరంజీవి ప్రస్తావన తెచ్చారనీ, ‘తమ్ముడితో కలిసి పనిచేస్తే బావుంటుంది..’ అని చిరంజీవికీ సూచించారనీ తెలుస్తోంది.