క‌మ‌ల్-ర‌జ‌నీల‌కు చిరు రాజ‌కీయ స‌ల‌హా

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీతో ప్ర‌జ‌ల‌కు సేవచేయాల‌ని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి యూట‌ర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సామాజిక న్యాయం అంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన చిరు రాజ‌కీయాల్లో విఫ‌ల‌మ‌య్యారు. దాదాపు ప‌దేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉండి రాజ‌కీయాన్ని చ‌దివారు. తాజాగా అదే అనుభ‌వంతో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లు రాజ‌కీయాల్లోకి రాక‌పోతేనే మంచిద‌ని చిరు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న ఆనంద్ విక‌ట‌న్ అనే త‌మిళ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ఈ విష‌యాలు చెప్పుకొచ్చారు.

రాజ‌కీయాలు డ‌బ్బు మ‌యం అయిపోయాని వ్యాఖ్యానించారు. అందుకే వారిద్ద‌రూ రాజ‌కీయాల‌లోకి రావొద్ద‌ని సూచించారు. నిజాయితీగా ప్ర‌జ‌ల‌కు ఏద‌న్నా చేద్దామ‌నుకున్నా ఏమీ చేయ‌లేరంటూ త‌న‌కు ఎదురైన రాజ‌కీయ అనుభ‌వాన్ని గుర్తు చేసుకున్నారు. నేను రాజ‌కీల్లోకి వ‌చ్చిన‌ప్పుడు సినిమా రంగంలో నెంబ‌ర్ 1 గా ఉండే వాడిని. అన్ని వ‌దులుకుని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాను. కానీ నా సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఓడిపోయాను. నా ప్ర‌త్య‌ర్ధ‌లు కోట్లు కుమ్మ‌రించి న‌న్ను ఓడించారు. అదే స‌న్నివేశం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎదురైంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ హాస‌న్ పార్టీ గెలుస్తుంద‌ని అనుకున్నా కానీ అలా జ‌ర‌గ‌లేదు. సౌమ్యంగా ఉండే వ్య‌క్తుల‌కు రాజ‌కీయాలు టీ తాగినంత సుల‌వు కాదు. క‌మ‌ల్ , ర‌జనీ నాలా కాక‌పోయినా వారిద్ద‌రికి నా స‌ల‌హా ఒక్క‌టే. రాజ‌కీయాల‌లోకి రావొద్ద‌నే చెబుతున్నా. ఒట‌మి ఎదురై ఎదురుదెబ్బ‌లు తిన్నా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటే రాజ‌కీయాల‌లోకి రావొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల్ నీది మ‌య్యం అనే రాజ‌కీయ పార్టీని స్థాపంచిన సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీ పార్టీ స్థాప‌న ఆలోచ‌న‌లో ఉన్నారు.