విజయనగరం పేరెత్తితే గుర్తిచ్చేది పూసపాటి రాజులు వంశం. రాజ్యాలు పోయినా వీరికి కుటుంబ చరిత్ర మాత్రం ఇంకా ఘనంగానే ఉంది. ఈ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను శాసిస్తోంది. అశోక్ గజపతిరాజు 1972 నుండి 1999 వరకు 6 పర్యాయాలు, తర్వాత 2009లోను ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2004లోనే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీని చిత్తూ చేస్తూ వచ్చిన ఆయన ఒక మహిళా నేత ధాటికి కదిలిపోయారు. ఆమె మీసాల గీత. తూర్పు కాపుల సామాజికవర్గానికి చెందిన ఆమె ప్రజారాజ్యం నుండి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో పోటీచేసి టీడీపీకి ముచ్చెమటలు పట్టించారు. అప్పటివరకు భారీ మెజారిటీతో గెలుస్తూ వచ్చిన అశోక్ గజపతిరాజు గీత ఎంట్రీతో ఓటమి అంచుల వరకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన కేవలం 3 వేల ఓట్ల మెజారిటీతో సర్దుకోవాల్సి వచ్చింది.
అనంతరం గీత కూడ టీడీపీలో చేరారు. ఆమె సామాజిక వర్గం యొక్క బలాన్ని గుర్తించిన బాబుగారు 2014 ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అధినేత చెప్పడంతో సోస్క్ గజపతిరాజు కూడ అసెంబ్లీ స్థానాన్ని వదిలి లోక్ సభ స్థానానికి పోటీచేసుకున్నారు. ఆ ఎన్నికల్లో గీత 15 వేల ఓట్ల మెజారిటీ సాధించి సంచలనం సృష్టించారు. అప్పటి నుండి గజపతి రాజుల ఆధిపత్యాన్ని తట్టుకుంటూ పార్టీలో, జిల్లాలో ఎదుగుతూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికలో మాత్రం అశోక్ గజపతి రాజు ఒత్తిడితో చంద్రబాబు ఆమెను పక్కనపెట్టి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి టికెట్ ఇచ్చారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు. మీసాల గీతకే టికెట్ ఇచ్చి ఉంటే ఆ స్థానం టీడీపీ ఖాతాలో పడేదే. కానీ బాబుగారి పొరపాటు సమీకరణాల వలన కోల్పోవాల్సి వచ్చింది. ఇక టికెట్ దక్కని గీత అధిష్టానం మీద కోపం పెంచుకున్నారు.
ఎన్నికల తరువాతైనా పార్టీలో ప్రాముఖ్యత దక్కుతుందని ఆశిస్తే అది కూడ దక్కకపోవడంతో గీత ఎదురుతిరిగారు. పార్టీలోనే ఉంటున్నా సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఆమె వైసీపీలోకి వెళతారని టాక్ ఉంది. అదే జరిగితే విజయనగరంలో టీడీపీకి గడ్డుకాలమే అనాలి. ఇక గీత ఎంట్రీ ఇస్తారనే వార్తలతో వైసీపీలో కూడ కలకలం రేగింది. 2004లో స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొందిన కోలగట్ల వీరభద్రస్వామి దాదాపు 15 ఏళ్ల తర్వాత 2019 ఎన్నికలో గెలిచారు. రానున్న ఎన్నికల్లో అయన తన వారసులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. అయితే మీసాల గీత పార్టీలోకి వెళితే ఆయన ఆశలకు గండిపడ్డట్టే. ఆమె గనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే తప్పకుండా టికెట్ ఆశిస్తారు. పైపెచ్చు పార్టీలో ఆమెకు కొందరు సీనియర్ల సపోర్ట్ కూడ ఉందట. ఆమెను పార్టీలోకి తీసుకురావాలని వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారట.
దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంగారుపడుతున్నారు. నిజానికి గత ఎన్నికల్లో గీత పోటీలో లేకపోవడం, జగన్ ఛరీష్మా, టీడీపీ నుండి అనుభవంలేని అదితి పోటీలో ఉండటం, ఆమె గెలుపుకు గీత కృషి చేయకపోవడం లాంటి అనేక కారణాలు కలిసిరావడంతో కోలగట్ల ఎమ్మెల్యే అయ్యారు. అదే గీత తలుచుకుని ఉంటే ఆయన ఓడేవారే. ఈ సంగతి వైసీపీ అదిష్టానానికి కూడ తెలుసు. అందుకే ఆమె పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి మీసాల గీత పార్టీలో ఉంటారు రాలేదా అనే కంగారు టీడీపీకి, ఆమె పోటీపడితే టికెట్ దొరకదని టెంక్షన్ వైసీపీ ఎమ్మెల్యేకి తప్పేలా లేవు.