చట్టం డబ్బున్న వారికి చుట్టమా? అధికారం అండగా అడ్డగోలుగా వేల కోట్లు సంపాదిస్తే ఎవరూ పట్టించుకోరా? తన సొంత మీడియా ఆసరాతో నిజాలకు పాతరేసి అసత్యాలను ప్రచారం చేస్తే నేరం నుంచి బయట పడిపోవచ్చా? తమ తండ్రి అక్రమ సంపాదనకే వారసులం కాని ఆయన చేసిన ఆర్థిక నేరాలతో తమకు సంబంధం లేదంటే చెల్లుతుందా? కచ్చితంగా చెల్లదు అని అటు తెలంగాణ హైకోర్టు, ఇటు రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా విస్పష్టంగా తేల్చి చెప్పాయి. చట్టం చేతులు చాలా పెద్దవని, అక్రమ సంపాదనతో ఒక వెలుగు వెలిగి ఆనక ఏ కలుగులో దాక్కున్నా పిలకపట్టుకొని బయటకు లాగుతుందని రూఢీ చేశాయి. రామోజీరావు మరణాన్ని అడ్డు పెట్టుకొని మార్గదర్శి కేసు నుంచి బయట పడేందుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌తో పాటు రామోజీ స్థానంలో హెచ్‌యూఎఫ్ (హిందూ అవిభాజ్య కుటుంబం) కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు చేసిన యత్నాలను తెలంగాణ హైకోర్టు అడ్డుకుంది.
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్లుగా స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆసలు తనను విచారించడానికే వీలు లేదని అటు ఆర్‌బీఐ ముందు, ఇటు కోర్టుల్లోనూ 18 ఇయర్స్‌గా దబాయిస్తోంది. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని చెప్పే ఆర్‌బీఐ చట్టం సెక‌్షన్ 45 ఎస్ కానీ, ఇది శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసే ఆర్‌బీఐ చట్టం సెక‌్షన్ 58 బీ (5ఏ) తమకు అస్సలు వర్తించవని మార్గదర్శి ఫైనాన్షియర్స్ చాన్నాళ్లు వాదించింది.
రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ విషయంలో పట్టు వదలని విక్రమార్కుడు మాదిరి పనిచేశారు. అటు తెలంగాణ హైకోర్టులో, ఇటు సుప్రీంకోర్టులో కూడా మార్గదర్శి చేసింది ముమ్మూటికీ చట్టవిరుద్ధమని నిబంధనలు ఉటంకించి రుజువు చేశారు. దీంతో తాము అక్రమంగా సేకరించిన డిపాజిట్ల సొమ్ము రూ.2,600 కోట్లు తిరిగి లబ్ధిదారులకు చెల్లించేశామని, తమపై చర్య తీసుకోవడం చెల్లదని మార్గదర్శి సుప్రీంకోర్టులో కొత్త వాదాన్ని వినిపించింది. అయితే ఎవరెవరికి, ఎప్పుడు, ఎంత మొత్తం చెల్లించారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను దిగువ కోర్టు అయిన తెలంగాణ హైకోర్టు కొనసాగిస్తుందని కూడా స్పష్టం చేసింది. దీంతో మార్గదర్శి ప్లేట్ ఫిరాయించింది.
తాము అక్రమాలకు పాల్పడలేదని, రామోజీరావు ఎటువంటి తప్పు చేయలేదని 18 ఏళ్లుగా అటు కోర్టుల్లో, ఇటు తన ఈనాడు ప్రతిక ద్వారా అడ్డగోలు వాదనలు వినిపిస్తున్న మార్గదర్శి పైనాన్షియర్స్ సడన్‌గా ప్లేట్ ఫిరాయించింది. రామోజీరావు మరణించినందున ఈ కేసును ఇక విచారించనక్కరలేదని మరో వాదం తెరపైకి తెచ్చింది. రామోజీ చేసిన తప్పులకు ప్రస్తుత హెచ్‌యూఎఫ్ కర్త అయిన ఆయన కుమారుడు కిరణ్‌ను శిక్షించడం న్యాయం కాదని పేర్కొంటూ ఇన్నేళ్లకు మొట్ట మొదటిసారిగా రామోజీ తప్పు చేశారని పరోక్షంగా మార్గదర్శి పైనాన్షియర్స్ కోర్టు సాక్షిగా అంగీకరించింది. అయితే దీనిపై ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసిన ఆర్‌బీఐ మార్గదర్శి వాదనలను పూర్తిగా రాంగ్ అని తేల్చింది.
కర్త రామోజీరావు మరణించి నంత మాత్రాన మార్గదర్సి ఫైనాన్షియర్స్ తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలదని ఆర్‌బీసీ స్పష్టం చేసింది. ఈ కేసులో క్రిమినల్ ప్రోసీడింగ్స్ కొనసాగించడం నిష్ప్రయోజనం అంటూ మార్గదర్శి చేసిన వాదన అసంబద్ధమని పేర్కొంది. ఆర్‌బీఐ చట్టం సెక‌్షన్ 45 ఎస్, సెక‌్షన్ 58 బీ (5ఏ) సెక‌్షన్లు ఈ కేసులో వర్తిస్తాయని కుండబద్దలు కొట్టింది. అలాగే తాము మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు డిపాజిట్ల సేకరణకు ప్రత్యేక అనుమతి ఇస్తూ సర్టిఫికెట్ జారీ చేశామని ఆ సంస్థ ఇన్నాళ్లూ చేసిన వాదన పూర్తిగా అవాస్తమని, తాము మార్గదర్శికి అటువంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని తన అఫిడవిట్‌లో ఆర్‌బీఐ వివరించింది. రామోజీ మరణంతో ఈ కేసులో క్రిమినల్ ప్రోసీడింగ్స్ కొనసాగించవద్దన్న మార్గదర్శి అనుబంధ పిటిషన్‌ను, నాంపల్లి కోర్టులో కర్త అయిన తనపై దాఖలైన ఫిర్యాదు కొట్టేయాలని కిరణ్ వేసిన క్వాష్ పిటిషన్‌ను సైతం డిస్మిస్ చేయాలని ఆర్‌బీసీ తన కౌంటర్‌లో తెలంగాణ హైకోర్టును కోరింది.
ఈ కేసుల్లో కర్త రామోజీరావు మరణించాక ఆయన కుమారుడు కిరణ్ కొత్తగా కర్త అయ్యారని, మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నందున ఆ తప్పులకు ప్రస్తుత కర్త బాధ్యత వహించాలి కదా? అని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. తమ తండ్రి అక్రమ సంపాదనకే తాము వారసులం కాదని ఆయన చేసిన తప్పులకు తాము బాధ్యత వహించం అని రామోజీ తనయుడు, అతని కుటుంబ సభ్యులు చేస్తున్న వాదాన్ని అటు ఆర్‌బీఐ ఖండించగా, ఇటు హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణకు కేసును ఈ నెల 28వ తేదీకి జస్టిస్ పి.శ్యామ్‌కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం వాయిదా వేసింది.
తనకున్న రాజకీయ పలుకుబడితో, మీడియా అండతో అడ్డగోలు వాదనలు వినిపిస్తూ ఈ కేసును సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ తదుపరి విచారణలో తన వాదనలు ఎలా వినిపిస్తుందన్నది ఆసక్తికరం.