ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ఆలయాల మీద దాడులు, మతం, దేవుడి పేరును అడ్డు పెట్టుకుని ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం బాగా ఎక్కువైంది. మత పరమైన విమర్శలతో జగన్ సర్కారును ఇరుకునపెట్టే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఈ ఉచ్చు నుండి తప్పించుకోకపోతే జగన్ చాలా ఇబ్బందులుపడాల్సి ఉంటుంది. అందుకే ఆయన ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను రంగంలోకి దింపారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడ అపాయింట్మెంట్ ఇవ్వని ఆయన పీకేతో రెండు గంటల పాటు చర్చించారు.
ప్రస్తుతం అటు వైసీపీలో, ఇటు టీడీపీలో ఈ సమావేశం గురించే చర్చ నడుస్తోయింది. అసలు పీకేను జగన్ ఎందుకు కలిసినట్టు. రాష్ట్రంలోని పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి కాబట్టి పిలిపించారనే అనుమానాలు మొదలవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ దేవాలయాల విషయంలో తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారాన్ని ఎదుర్కోవడం ఎలాగో పీకే వద్ద సలహా తీసుకున్నారని, ఆ సలహాను అమలుచేయమని చెప్పారని అంటున్నారు.
అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడ చర్చకు వచ్చిందట. జగన్ ఏర్పాటుచేసిన ఈ వాలంటీర్ వ్యవస్థే పాలనను ప్రజలకు చేరువ చేస్తోంది. ఇంతకుముందులా ప్రజలకు లోకల్ లీడర్లు, పార్టీ మనుషులు, కార్యకర్తల అవసరం లేకుండా పోయింది. వాలంటీర్లే ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతున్నారు. ప్రజల నుండి కావాల్సిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్నది కూడ వారే. అలా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన వారధిలో మారారు. గతంలో పార్టీ శ్రేణులు చేసే అన్ని పనులను వీరే చక్కబెట్టేస్తున్నారు. దీంతో కార్యకర్తలు ఎలాంటి పనీ లేక సైలెంట్ అయిపోయారు. ఇది ఒకరకంగా పార్టీకి నష్టమే. క్షేత్రస్థాయిలో బలహీనపడి ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో పరిష్కారం కనుగొనాలని పీకేకు జగన్ తెలిపారని చెబుతున్నారు. మరి ప్రధాన సమస్యలను పీకే పరిష్కరిస్తారో చూడాలి.