మాచర్ల సెగ.! వైసీపీ ఇమేజ్ డ్యామేజ్.!

ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 175 సీట్లకు గాను 175 సీట్లలో ఎలా గెలవాలన్నదానిపై పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తోంటే, వైసీపీ నాయకులు మాత్రం, పార్టీ ప్రతిష్ట గురించి కనీసం ఆలోచించడంలేదు.

గుంటూరు జిల్లా మాచర్లలో నిన్న టీడీపీ శ్రేణులకీ, వైసీపీ శ్రేణులకీ మధ్య జరిగిన రచ్చ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ చాలా చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయింది. టీడీపీ ప్రతిపక్షంలో వుంది. ఆ పార్టీ చేసింది తప్పే. రెచ్చగొట్టే చర్యలు ఎవరు చేసినా అది సమర్థనీయం కాదు. కానీ, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు.?

అధికారంలో వున్నోళ్ళే సంయమనం పాటించాలి. ఎందుకంటే, ఏ ఘటన జరిగినా చెడ్డపేరు వచ్చేది అధికార పక్షానికే. ప్రభుత్వ వైఫల్యం.. అంటే, అధికార పార్టీ మీద అది చాలా చాలా పెద్ద మర్చ. కానీ, ఆ సోయ అధికార పార్టీ నాయకుల్లో వుండడంలేదు.

ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతల వాహనాల్ని తగలబెట్టడం, ఇళ్ళను ధ్వంసం చేయడం దేనికి సంకేతం.? ఈ విషయంలో పోలీసులు కూడా అత్యుత్సాహమే ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ నేతల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. విపక్ష నేతల మీద మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు.
చంద్రబాబు హయాంలోనూ ఇదే జరిగింది. అందుకే, టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది.

పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మలా మారిపోతున్నమాట వాస్తవం. కానీ, దానివల్ల పోలీసు వ్యవస్థకు వచ్చే చెడ్డపేరు ఓ వైపు, అధికార పార్టీ పతనం ఇంకో వైపు.! ఇలాగైతే, వైఎస్ జగన్ ఆశిస్తున్న ‘వైనాట్ 175’ లక్ష్యానికి తూట్లు పడటం ఖాయం.