చినబాబు యువగళం.. తమ్ముళ్ల టెన్షన్ ఇది!

యువగళం పేరుచెప్పి చినబాబు లోకేష్ కష్టపడుతున్నారు. పెద్ద టార్గెట్టే పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టారు. అలా ప్రారభమైన ప్రయాణం ఇప్పటికే మూడు వారాలు దాటేసింది. అయితే.. ఈ యాత్రవల్ల టీడీపీకి ఒరిగేది ఏమైనా ఉందా.. చినబాబు గ్రాఫ్ ఏమైనా పెరుగుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును.. సొంత జిల్లాలో చినబాబు పాదయాత్రను మొదలుపెట్టారు. ఆశించిన స్థాయిలో జనాలు రావడం లేదనేది స్వయంగా తమ్ముళ్లే చెబుతున్న పరిస్థితి. అంచనాలకూ – వాస్తవాలకూ అసలు పొంతనే లేదనేది వారి ఆవేదన. సొంత జిల్లాలోనే పరిస్థితి అలా ఉంటే… ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటి అన్నది మరీ పెద్ద ప్రశ్నగా ఉంది.

సాధారణంగా నాయకులు పాదయాత్రలు చేస్తున్నప్పుడు ఆ నాయకుడిని చూడటానికైనా ప్రజలు వచ్చి వెళ్తుంటారు. నాడు జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. వేల సంఖ్యలో జనాలు స్వయంగా తరలి వచ్చేవారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం అని నమ్మేవారు. వారి వారి సమస్యలు చెప్పుకొనేవారు. కానీ.. చినబాబు విషయంలో అది మిస్సవుతుందనేది తమ్ముళ్ల బాద!

ఇదేక్రమంలో.. ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకోని సాగుతున్న ఈ యాత్రను పార్టీ సీనియర్లు సీరియస్ గా తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు ఒక కారణంగా చెబుతున్నారు. పోనీ వ్యక్తిగత చరిష్మా, వాక్ చాతుర్యంతో అయినా చినబాబు నెట్టుకొస్తారు అనుకుంటే… వెటకారం – బూతులు – సవాళ్లు తప్ప ప్రజలకు పనికొచ్చే పలుకులు కరువయ్యాయనేది కూడా అతి పెద్ద సమస్యగా ఉంది!

దీంతో… కష్టపడి తిరుగుతున్నాడు కానీ అదంతా వృథా ప్రయాసే అవుతుందేమో అనేది తమ్ముళ్ల డిస్కషన్! మరికొన్ని రోజులు వేచి చూస్తే… తమ్ముళ్ల టెన్షన్ కి మరింత స్పష్టమైన సమాధానం దొరకొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం!