తెలుగుదేశం పార్టీ యువకిశోరం నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఫలితంగా ప్రత్యర్థులకు అడ్డంగా దొరికిపోతున్నారు. దీంతో.. తలలు పట్టుకోవడం తమ్ముళ్ల వంతవుతుంది.
తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ.. జనాలకు అన్ని తెలివితేటలు లేవులే అన్నట్లుగా కొన్న వ్యాఖ్యలు చేస్తుంటారు చినబాబు లోకేష్. పాదయాత్రలో భాగంగా తాజాగా తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు లోకేశ్. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్థానికతపై చినబాబు విమర్శలు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డిది కడప జిల్లా అని, ఇక్కడ (తిరుపతి) పెత్తనం చేస్తున్నారని విమర్శించారు.
దీంతో కౌంటర్లపై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు వైకాపా కేడర్. అసలు స్థానికతల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లోకేష్ కి, టీడీపీ నేతలకు ఎక్కడుంది అనేది నెటిజన్ల ప్రశ్న. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి! కానీ.. ఆ నియోజకవర్గాన్ని వదిలి కుప్పానికి వలస వెళ్లారు. అక్కడి నుంచే మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఇక చంద్రబాబు బామ్మర్ది, నారా లోకేష్ మామగారు అయిన నందమూరి బాలకృష్ణ.. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక లోకేశ్… గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
వీరంతా పుట్టింది ఒక చోట, పెరిగింది మరోచోట, ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఇంకో చోట. ఈ విషయాలు మరిచిన చినబాబు… కరుణాకరరెడ్డి స్థానికతపై మాట్లాడటం.. గురివింద కబుర్ల కిందకు వస్తుందని ఆన్ లైన్ వేదికగా సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు!
కాగా… భూమన కరుణాకరరెడ్డి తండ్రిది కడప జిల్లా. వృత్తి రీత్యా ఆయన రైల్వేలో ఉద్యోగి. అనంతరం తిరుపతిలో సెటిల్ అయ్యారు. తిరుపతిలోనే భూమన కరుణాకరరెడ్డి జన్మించారు. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో పుట్టడమే అదృష్టంగా చెప్పే ఆయన… ప్రపంచంలో ఏ నగరానికి లేని విధంగా “తిరుపతికి పుట్టిన రోజు” ఉందని, వరుసగా రెండో ఏడాది ఆ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే!!