Nara Lokesh: సర్కారు బడిలో ‘వినూత్న’ పాఠం.. టీచర్‌ కౌసల్యపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న పద్ధతుల్లో విద్యాబోధన చేస్తూ, విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వరుసగా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనుసరిస్తున్న బోధనా విధానంపై మంత్రి లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఆమె చెబుతున్న పాఠాలు, క్రియేటివిటీ తనను ఆకట్టుకున్నాయంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

ఎవరీ కౌసల్య టీచర్? అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం, పైదొడ్డి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుకెరామిరెడ్డిపల్లి కౌసల్య సెకండరీ గ్రేడ్ టీచర్‌ (SGT)గా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణ తరగతి గదిని ఆమె తనదైన శైలిలో ఆసక్తికరంగా మలిచారు. విద్యార్థులలో ఒకరిగా కలిసిపోయి.. ఆటపాటలతో, సామెతలు, సూక్తులతో పాఠాలు బోధించే విధానం ఆమె ప్రత్యేకత.

‘ఇంగ్లిష్ మేడ్ ఈజీ’.. (English Made Easy) గ్రామీణ విద్యార్థులకు క్లిష్టంగా అనిపించే ఇంగ్లిష్, గణితం వంటి సబ్జెక్టులను కౌసల్య టీచర్ చాలా సులభంగా నేర్పిస్తున్నారు.

“English made easy” “Lets learn with techniques” అంటూ ఆమె రూపొందించిన పద్ధతులు విద్యార్థులకు సబ్జెక్టుపై భయం పోగొట్టి, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మంత్రి లోకేశ్ స్పందన ఇదీ.. కౌసల్య టీచర్ బోధనా వీడియోలను వీక్షించిన మంత్రి లోకేశ్.. “సోషల్ మీడియా వేదికగా కౌసల్య టీచర్ చేస్తున్న ‘ఎడ్యుటైన్‌మెంట్’ (వినోదంతో కూడిన విద్య) కంటెంట్ చాలా బాగుంది. ఆమె బోధనా శైలి అద్భుతం,” అని కొనియాడారు. ప్రభుత్వ బడుల్లో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండటం గర్వకారణమని, ఆమె మిగిలిన వారికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు.

జగన్ సింగల్ సింహం || Thalapathy Vijay Great Words About Ys Jagan || Pawan Kalyan || Telugu Rajyam