చంద్రబాబుకి కొత్త శత్రువులు అవసరం లేదు… లోకేష్ చాలు!.

ప్రస్తుతం యువగళం పాదయాత్రలో టీడీపీ యువకిశోరం నారా లోకేష్ దూకుడు మీదున్నారు. ఇప్పటికే వందరోజుల రికార్డును సృష్టించిన ఆయన.. రెట్టించిన ఉత్సాహంలో జనాల్లో నడుతున్నారు. టీడీపీ అనుకూల మీడియాలో సైతం లైవ్ లు, ఫుల్ కవరేజ్ లూ దొరకకపోయినా.. తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు కదులుతున్నారు. అయితే ఈ సందర్భంలో తనకున్న ప్రత్యేక జ్ఞానంతో చంద్రబాబుని ఇరకాటంలో పాడేస్తున్నారు చినబాబు!

ప్రస్తుతం చినబాబు లోకేష్ నంద్యాలలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక రైతులతో ముఖాముఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అడిగిన ప్రశ్నలకు వరాలు ప్రకటించారు. తన తండ్రి హయాంలోనే ఎన్నో ప్రాజెక్టులకు డబ్బులు కూడా సాంక్షన్ చేశారు కానీ.. ఈలోపే ప్రభుత్వం మారిపోయిందని చెప్పుకొస్తున్నారు. అయితే తన తండ్రి వేసిన శిలాఫలకాలను పగలగొట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన్న వచ్చిన సమేస్యేమీ లేదని… గత ప్రభుత్వంలోనే వీటికి సంబందించిన అంచనాలు వేశామని, కాంట్రక్టర్లను పిలవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కాకపోతే ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడం వల్ల ఆ పనులు తాము చేయలేకపోయాయమని వాపోయారు. ఆ సంగతులు అలా ఉంటే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ మంచినీళ్లు లేక జనాలు పడుతున్న ఇబ్బందులు చూశామని విచారం వ్యక్తం చేశారు లోకేష్.

అవును… ఈమధ్య ఉమ్మడి చిత్తురు జిల్లాలోని నియోజకవర్గాల్లో తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు అన్నీ గమనించినట్లు లోకేష్ తెలిపారు. ప్రతీ వీధిలోనూ మంచినీళ్లు లేక మహిళలు బిందులతో తోపుడు బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నారని.. తాము అధికారంలోకి వచ్చిన మూడే మూడేళ్లలో మంచినీటి సమస్యను తీరుస్తామని.. ఈ మేరకు చంద్రబాబు ప్రణాళికలు వేస్తారని తెలిపారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు!

ఉమ్మడి రాష్ట్రంతో కలిపి చంద్రబాబు ఇప్పటివరకూ 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 5ఏళ్లు సీఎంగా ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ సొంత జిల్లాలో మంచినీటి సమస్యను పరిష్కరించలేకపోయారు. అలాంటి చంద్రబాబుకు మరోసారి అధికారం ఇస్తే… మూడేళ్లలోనే పూర్తి చేస్తారని చినబాబు చెబుతున్నారు. ఇంతకు మించిన వంచన మాటలు మరొకటి ఉంటాయా అంటూ వాయించేస్తున్నారు నెటిజన్లు.

ఐదేళ్ల పదవీకాలం అంతా సింగపూర్ టు అమరావతి, అమరావతి టు సిగపూర్ చక్కర్లు కొట్టి… రాష్ట్రాన్ని అదోగతిపాలుచేసిన బాబుకు మరోసారి అధికారం ఇస్తే… ఆయన సీఎం అయిన మూడు సంవత్సరాల్లోనే మంచినీటి సమస్య తీరుస్తామని చెబుతున్నారు అంటూ సెటైర్స్ పేలుస్తున్నారు. దీంతో… చంద్రబాబును చినబాబు ఇరుకున పెడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. లోకేష్ కు ప్రజలతో నేరుగా ఇంతింత సమయం గడపడం, అడిగిన ప్రశ్నలకు స్పందించడం ఫస్ట్ టైం కావొచ్చు కానీ… చంద్రబాబు 40ఏళ్ల అనుభవశాలని. ఇప్పటికీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కుడా మంచి నీటి సమస్య తీర్చలేదనే విషయం చినబాబు గ్రహించాలని సూచిస్తున్నారు!