ట్విట్టర్లో రెచ్చిపోతున్న లోకేష్

ట్విట్టర్లో నారా లోకేష్ రెచ్చిపోతున్నారు.  మొన్నటి వరకూ పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లోను మాట్లాడి నవ్వుల పాలైన లోకేష్ ఎన్నికల తర్వాత మాత్రం ట్విట్టర్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏమీ మాట్లాడలేకపోయారు షాక్ తో.

అయితే ఆ తర్వాత తేరుకుని ట్విట్టర్లో మాత్రమే ఇపుడు కనబడుతున్నారు. అదికూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడటానికి మాత్రమే ట్విట్టర్ ను వేదికగా వాడుకుంటున్నారు. తాజాగా ’జగనన్న వచ్చాడు ప్రపంచబ్యాంకు పోయింది’ అంటూ ట్వీట్ చేశారు. తాజా ట్వీట్లో మాట్లాడుతూ జగన్ సిఎం అవ్వటం వల్లే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వకుండా నిలిపేసిందంటూ ఎద్దేవా చేశారు.

జగన్ అమరావతిని పడగొట్టేశారట. రైతులను రెచ్చగొట్టడం, పంటలను తగలబెట్టటం, దొంగ ఉత్తరాలు రాయటంలో జగన్ చరిత్ర తెలసుకుని ప్రపంచబ్యాంకు రుణం ఆపేసిందంటూ లోకేష్ చెప్పటం విచిత్రంగా ఉంది. ఎందుకంటే పంటలు  అప్పట్లో తగలబెట్టింది టిడిపి నేతలే అని అప్పుడే తేలిపోయింది. నిజంగానే వైసిపి నేతలే ఆ పనిచేసుంటే ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదు ?

ఇక రైతులను రెచ్చగొట్టటం కూడా అబద్ధమే. చాలామంది రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేద్దామని అనుకుంటే కోర్టులకు కూడా వెళ్ళి స్టేలు తెచ్చుకున్నది వాస్తవమే కదా ? రైతులే కాదు స్వచ్చంద సంస్ధలు, హక్కుల సంస్ధలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకుకు లేఖలు రాసాయి. మొదటి నుండి కూడా వాస్తవాలను వక్రీకరించి ప్రత్యర్ధులపై బురదచల్లటంలో టిడిపికి మించిన పార్టీ మరొటి లేదన్నది అందరికీ తెలిసిందే. తాజాగా లోకేష్ ట్వీట్లతో జగన్ పై చేస్తున్నది కూడా అదే.